శశికళ సీఎం ఆశలకు సుప్రీం షాక్

త‌మిళ రాజ‌కీయాల‌ను త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ఎన్నో క‌లలు కంటున్న దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళకు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం షాక్ ఇచ్చింది. అసంతృప్తులంద‌రినీ న‌యానో భ‌యానో త‌న వైపు లాక్కుని త‌మిళ‌ సీఎం పీఠంపై శ‌శిక‌ళ‌ కూర్చోబోతున్న వేళ‌.. ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. జ‌య అక్ర‌మాస్తుల‌కు సంబంధించిన కేసు తుది తీర్పును మ‌రో వారంలోగా వెలువ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో తమిళ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి! అత్యున్న‌త ధ‌ర్మాసనం ఇచ్చే తీర్పుపైనే శ‌శిక‌ళ‌ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌టంతో ఇప్పుడు అన్నాడీఎంకేలో, శ‌శిక‌ళ‌లో తీవ్ర ఉత్కంఠ మొద‌లైంది.

త‌మిళ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి! సీఎం ప‌న్నీర్ సెల్వం నుంచి అధికార ప‌గ్గాలు అందుకుని.. సీఎం పీఠంపై కూర్చునేందుకు రంగం సిద్ధం చేసుకున్న జయలలిత నెచ్చెలి శశికళకు సుప్రీంకోర్టు దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. మరో వారం రోజుల్లోగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై తుదితీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించింది.

ఇదే కేసులో శశికళ సహ నిందితురాలిగా ఉన్న విష‌యం తెలిసిందే. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ జయలలితపై అవినీతి నిరోధక చట్టం కింద 1996లో కేసు నమోదైంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 2014లో జయను దోషిగా పేర్కొంటూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు సహనిందితురాలిగా ఉన్న శశికళకు కూడా జైలు శిక్ష పడింది.

2015లో కర్నాటక హైకోర్టు జయలలితపై నమోదైన కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలిత కొంతకాలం సీఎం పీఠానికి దూరమైనప్పటికీ… గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టారు. జయ మరణంతో ఏఐడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని శశికళ చేపట్టారు.

తాజాగా వారం రోజుల్లో వెలువడనున్న సుప్రీం తీర్పుతో శశికళ సీఎం కావాలన్న కోరిక తీరుతుందా? లేదా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా అయితే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎలా నిలబెడతారంటూ ఆ పార్టీ అసమ్మతి ఎంపీ శశికళ పుష్ప ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే!!