సాక్షికి జై కొట్టిన టీడీపీ మంత్రి

విన‌డానికి, న‌మ్మ‌డానికి ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజ‌మే! టీడీపీ బ‌ద్ధ శ‌త్రువైన వైకాపా అధినేత జ‌గ‌న్ ప‌త్రిక‌ను ఆకాశానికి ఎత్తేశారు చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలోని చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడు. సాక్షి ప‌త్రిక‌ను చ‌ద‌వంతే పొద్దు పొడ‌వ‌ద‌ని తేల్చి చెప్ప‌డంతో విన్న‌వాళ్లంద‌రూ ఇది నిజ‌మా?! అని ఒక్క‌సారిగా సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు.

వాస్త‌వానికి సాక్షి ప‌త్రిక‌కు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భగ్గుమ‌ని మండే వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. ప‌లువురు మంత్రులు, నేత‌లు సైతం సాక్షి ప‌త్రిక వేస్ట్ అని, పొట్లాలు క‌ట్టుకోడానికి త‌ప్ప అది దేనికీ ప‌నికిరాద‌ని స‌టైర్ల‌తో విరుచుకుప‌డ‌డం తెలిసింది.

ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం కొన్నాళ్ల కింద‌ట నిర్వ‌హించిన ఓ స‌భ‌లో సాక్షి ప‌త్రికను ఎవ‌రూ చ‌ద‌వొద్దంటూ తీర్పు కూడా చెప్పారు. సాక్షికి టీడీపీకి మ‌ధ్య ప‌రిస్థితి ఇంత భీక‌రంగా ఉంటే.. అదే టీ డీపీకి చెందిన, నిత్యం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధించే మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న మాత్రం.. తాను సాక్షిని చ‌ద‌వ‌కుండా ఉండ‌లేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. విశాఖ‌లోని ఏయూ ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలో గురువారం ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్‌ మీడియా డైరీని ఆవిష్కరించి  మంత్రి మాట్లాడారు.

‘నిద్ర లేవగానే నేను పేపర్లు చదవుతా.. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికనే ముందు చదువుతా.. మా పార్టీ వాళ్లు ఈనాడు, జ్యోతి చదవమంటారు. సాక్షి చదవొద్దంటారు. ఈ రెండు పత్రికలు మాకు ఎప్పుడూ అనుకూలంగానే రాస్తాయి. నేనైతే మా లోపాలు.. తప్పులు ఎత్తిచూపే ‘సాక్షి’ పత్రికనే ముందుగా చదవాలంటాను’ అని మంత్రి అన్నారు.

ప్రజా జీవితంలో ఉన్న వారు ప్రెస్‌ను ఎవాయిడ్‌ చేయడం సరికాదని చెప్పారు. సమగ్ర కథనాలు, విశ్లేషణలు కావాలంటే దినపత్రికలే ఉండాలన్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా… మంత్రిగారి అభిప్రాయంతో అటు టీడీపీ అధినేత‌, ఇత‌ర త‌మ్ముళ్లు.. ఏకీభ‌విస్తారా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏం జ‌రుగుతుందో చూడాలి.