సుప్రీం తీర్పుతో ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు లింకు

ఏపీలో ప్ర‌భుత్వ ఏర్ప‌డి దాదాపు రెండున్న‌రేళ్లు పూర్త‌వుతోంది. దీంతో ఇప్పుడున్న మంత్రివ‌ర్గాన్ని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో మంత్రి వ‌ర్గంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్న సీనియ‌ర్ల‌ను శాంతింప జేయాల‌ని కూడా బాబు భావిస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ పార్టీని వీక్ చేసేందుకుగాను ప్లే చేసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో.. క్యూ క‌ట్టుకుని మ‌రీ వ‌చ్చి సైకిల్ ఎక్కిన వారిలో కొంద‌రు కేవ‌లం మంత్రి ప‌ద‌వుల మీద ఇష్టంతోనే వ‌చ్చార‌ని అప్ప‌ట్లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో ఇప్పుడు ఆలాంటి వారంద‌రినీ బాబు బుజ్జ‌గించాలి. ఈ క్ర‌మంలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ప్ప‌దు.

అయితే, ఈ ప‌ని త‌న చేతిలోదే క‌దా చంద్ర‌బాబు చేసేయొచ్చు క‌దా? అని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం అనేది ఇక్క‌డ అడ్డు వ‌చ్చే ప్ర‌ధాన అంశం. దీని నుంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుని గానీ ఇప్పుడు బాబు వ్య‌వ‌హ‌రించ‌లేని ప‌రిస్థితి. నిజానికి బాబు ఏపీలో ప్రోత్స‌హించిన విధంగానే తెలంగాణ‌లోనూ అక్క‌డి అధికార టీఆర్ ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. టీడీపీ ఎమ్మెల్యేల‌ను పిలిచి పిలిచి కారెక్కించుకున్నారు. అంతేకాదు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వంటివారికి మంత్రి ప‌దవులు కూడా క‌ట్ట‌బెట్టారు.

దీంతో ఇలాంటి వారంద‌రిపైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. కొంద‌రు టీడీపీ నేత‌లు స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ఆయ‌న మౌనం వ‌హించారు. దీంతో ఆయా నేత‌లు సుప్రీం కోర్టులో ఈవిష‌యంపై స‌వాలు చేశారు. టీడీపీ త‌ర‌ఫున నెగ్గిన అభ్య‌ర్థులు త‌ర్వాత రాజ‌కీయ కార‌ణాల‌తో పార్టీలు మారార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకునేలా స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై స్పందించిన సుప్రీం ఇప్ప‌టికే స్పీక‌ర్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న దీనిపై మ‌రోసారి విచారించి తీర్పు చెప్ప‌నుంది. ఈ క్ర‌మంలో ఇదే సిట్యుయేష‌న్ ఏపీలోనే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌పై జ‌గ‌న్ అండ్‌కో కారాలు మిరియాలు నూరుతోంది.

ఈ క్ర‌మంలో ఉన్న‌ప‌ళంగా చంద్ర‌బాబు.. మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించి వైకాపా ఎమ్మెల్యేల‌కు ఛాన్స్ ఇస్తే.. లేనిపోని త‌లనొప్పిని తెచ్చిపెట్టుకున్న‌ట్టు అవుతుంద‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే 8వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును అనుస‌రించి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు కాలు క‌ద‌పాల‌ని బాబు భావిస్తున్న‌ట్టు తెలిసింది. ఇదే విష‌యాన్ని బాబు.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కి కూడా స్ప‌ష్టం చేశార‌ని తెలుస్తోంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండ‌బోవ‌ని బాబు భావిస్తున్నారు. దీంతోనే ఆయ‌న సుప్రీం కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.