హిందూపురం టీడీపీలో సెగలు…సీక్రెట్ మీటింగ్

టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం చంద్ర‌బాబు బావ‌మ‌రిది బాల‌య్య‌పై అసంతృప్తి సెగ‌లు ఎగ‌సిప‌డుతున్నాయా ? ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాల‌య్య‌కు యాంటీగా సీక్రెట్ మీటింగ్ పెట్టే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లిందా ? అంటే అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది.

హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది పెట్ట‌ని కోట‌. ఎన్టీఆర్ ఇక్క‌డి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కూడా అయ్యారు. ఆయ‌న త‌ర్వాత హ‌రికృష్ణ, ఇప్పుడు ఆయ‌న మ‌రో త‌న‌యుడు బాల‌కృష్ణ ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. టీడీపీ తీవ్ర‌క‌ష్టాల్లో ఉండి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న 2004, 2009 ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డి నుంచి టీడీపీ అభ్య‌ర్థులు రంగ‌నాయ‌కులు, అబ్దుల్ ఘ‌నీ ఎమ్మెల్యేలుగా ఘ‌న‌విజ‌యం సాధించారు.

గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డి నుంచి బాల‌య్యే స్వ‌యంగా పోటీకి దిగ‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కే టిక్కెట్టు కేటాయించారు. బాల‌య్య హిందూపురం నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. బాల‌య్య కంటిన్యూగా సినిమాలు చేస్తూ అటూ సినిమాల్లోను, ఇటు పొలిటిక‌ల్‌గాను బిజీ బిజీగా ఉంటున్నారు. బాల‌య్య సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా హిందూపురంలో కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి ప‌నులు చేయిస్తున్నారు. కేంద్ర మంత్రుల ద్వారా కూడా ఆయ‌న నిధులు రప్పించి మ‌రీ హిందూపురాన్ని అభివృద్ధి చేయిస్తున్నారు.

మ‌రి హిందూపురంలో ఇంత బాగా అభివృద్ధి జ‌రుగుతున్నా బాల‌య్య‌కు యాంటీగా సీనియ‌ర్ నాయ‌కులు సీక్రెట్ మీటింగులు ఎందుకు పెట్టుకున్న‌ట్టు ఇప్పుడు ఇదే అంశం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి నియోజ‌క‌వ‌ర్గ సీనియ‌ర్లు అంద‌రూ క‌లిసి ఓ మీటింగ్ పెట్ట‌గా ఇప్పుడు లేపాక్షి మండ‌లంలో కూడా మ‌రో మీటింగ్ పెట్టేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది.

బాల‌య్య‌పై నాయ‌కుల‌కు డైరెక్టుగా అసంతృప్తి లేక‌పోయినా బాల‌య్య పీఏ రాజ‌శేఖ‌ర్‌పై తీవ్ర‌స్థాయిలో అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో పాటు సీనియ‌ర్ నాయ‌కుల‌ను అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ ఎఫెక్ట్ బాల‌య్య‌పై ఇన్‌డైరెక్టుగా ప‌డుతోంది. దీంతో వారంతా ఇప్ప‌టికే రాజ‌శేఖ‌ర్ ఆగ‌డాల‌పై బాల‌య్య‌కు కంప్లైంట్ చేశారు కూడా. ఆయ‌న రాజ‌శేఖ‌ర్ తీరులో మార్పు రాక‌పోవ‌డంతో అది బాల‌య్య‌పై అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది.

తాజా స‌మావేశానికి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, నాయకులు అంబికా లక్ష్మీనారాయణ కూడా హాజ‌ర‌య్యారు. బాల‌య్య ఇక‌పై అయినా రంగంలోకి దిగి పీఏ రాజ‌శేఖ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే టీడీపీ కంచుకోట‌లో అసంతృప్తి జ్వాల‌లు ఎగ‌సిప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.