2019లో తెలంగాణలో వార్ ఇలా ఉంటుందా..!

స‌రిగ్గా రెండున్న‌రేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌పుడు ఆ పార్టీ పైనా.., పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మొద‌టి ముఖ్య‌మంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పైనా ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. కాంగ్రెస్ ఆడిన రాజ‌కీయ జూదంలో ఆ పార్టీ వ్యూహాలు ఎదురుత‌న్ని.. ప‌రిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలించ‌డంతో… ఏదో గాలివాటంగా అధికారంలోకి వ‌చ్చింద‌ని భావించిన‌వారే రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అధిక‌శాతం. నిజానికి అందులో వాస్త‌వం లేక‌పోలేదు. ఎందుకంటే సోనియాగాంధీ వ్యూహ‌మేదైనా కావ‌చ్చుగాని సీమాంధ్ర‌లో పార్టీకి తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని తెలిసికూడా మొండిగా తెలంగాణ ఇచ్చి తీరాల‌న్న వైఖ‌రికి ఆమె గ‌ట్టిగా నిల‌బ‌డి ఉండ‌క‌పోతే ప్ర‌త్యేక‌ తెలంగాణ క‌ల బ‌హుశా ఎప్ప‌టికీ సాకార‌మ‌య్యుండేది కాదేమో…?

అయితే ఎప్పుడో చ‌ల్లారిపోయిన ప్ర‌త్యేక‌ తెలంగాణ ఉద్య‌మ వేడిని తిరిగి ర‌గ‌ల్చ‌డం, మ‌ధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా త‌ట్టుకుని దాన్ని తిరుగులేని రాజ‌కీయ ఆయుధంగా మ‌లుచుకోవ‌డంలో కేసీఆర్ చూపిన అనిత‌ర‌సాధ్య‌మైన చాతుర్యాన్ని ఇక్క‌డ త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్నిపొందేందుకు ఆ ప్రాంత భాష‌, యాస‌ను, తాము వెనుక‌బ‌డిఉన్నామ‌న్న భావ‌న‌ను కేసీఆర్ ఒడుపుగా వినియోగించుకున్న విధానం ఆయ‌న‌ను తెలంగాణ‌లో తిరుగులేని నాయ‌కుడిగా మార్చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో విప‌క్షాల ఉనికిని ఒక‌రకంగా నామమాత్రంగా మార్చేసిన కేసీఆర్ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీకి ఏక‌ప‌క్ష విజ‌యం ద‌క్కేలా ఇప్ప‌టినుంచే వ్యూహ‌ర‌చ‌న మొద‌లుపెట్టారు.

ప్ర‌త్య‌ర్థులకు దిమ్మ‌తిరిగే వ్యూహాల్ని సిద్ధం చేయటం ఎంత ముఖ్యమో… వాటిని అమలు చేయటం అంతే కీలకం.  అయితే కేసీఆర్ ఈ రెండు విషయాల్లోనూ మహా నేర్పరి అని ఇప్ప‌టికే తేలిపోయింది.  ఇక‌  వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌మే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకునేందుకు కేసీఆర్ బృహ‌త్త‌ర ప‌థ‌కాల‌నే త‌ల‌కెత్తుకున్నారు.  రెండున్న‌ సంవత్సరాల స్వల్ప వ్యవధి  మిగిలి ఉన్న‌ నేపథ్యంలో. .. అప్పటికి అవసరమైన గ్రౌండ్ ను కేసీఆర్ ఇప్ప‌టినుంచే  సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయన వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ప్రాజెక్టుల రీడిజైనింగ్,  మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇక ఇటీవ‌ల భారీ సంఖ్య‌లో కొత్త జిల్లాల ఏర్పాటు… ఇలాంటి అంశాల‌న్నింటి వెనుక‌ కేసీఆర్ దూరదృష్టి, ఓటుబ్యాంకు రాజకీయం చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. అయితే సామాన్యుల‌కు మాత్రం ఇవ‌న్నీ…  కేసీఆర్ ఎన్నోక‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి తెలంగాణ స‌మ‌గ్ర అభివృద్ధికోసం చేస్తున్న‌భ‌గీర‌థ‌ప్ర‌య‌త్నాలుగా క‌నిపించేలా చేయడంలోనూ కేసీఆర్ ఇప్ప‌టికే విజ‌యం సాధించారని చెప్పాలి.

కొత్త జిల్లాల సందడి ముగిసిన వేళ  తాజాగా కేసీఆర్ మిషన్ భగీరథ పథకంపై దృష్టి సారించారు. సాగు, తాగునీటికోసం ఇబ్బందులు ప‌డే జ‌నం సంఖ్య ఇప్ప‌టికీ ఎక్కువ‌గానే ఉన్న‌తెలంగాణ‌లో ఈ ప‌థ‌కం భ‌విష్య‌త్తు రాజ‌కీయ ఫ‌లితాల‌పై చూప‌గ‌ల ప్ర‌భావం కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే ఈ ప‌థ‌కంలో భాగంగా రెండు కీలక అంశాల్ని ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అందులో ఒకటి.. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో దళిత వాడల నుంచే మొదలుపెట్టాలన్నది కాగా.. రెండ‌వ‌ది  దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నది.. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏడాదికంటే ముందుగానే .. మిషన్ భగీరథ ఫలాల్నితెలంగాణ ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని.. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సొంత‌ చేసుకోవాలన్నది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

అంత‌కు మించి ఇక్క‌డ అంద‌రూ గుర్తుంచుకోవాల్సింది…. మిషన్ భగీరథ ఫ‌లితాల‌ను గ్రామాల్లోని దళిత కుటుంబాలకు ముందుగా అందించాల‌ని కేసీఆర్ తీసుకున్ననిర్ణ‌యం వెనుక దాగిన ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ని. నల్లా నీళ్ల కోసం నిత్యం ఎంతో శ్ర‌మ‌కోర్చే దళిత వాడలకు ఆ వెత‌ల‌ను తొల‌గించ‌క‌లిగితే… వారంతా అధికార ప‌క్షానికి బ‌ల‌మైన ఓటుబ్యాంకుగా మారిపోవ‌డం ఖాయం.ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని చ‌దివేయ‌గ‌ల‌గ‌డం.. అందుక‌నుగుణంగా… రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌ను మ‌లుచుకోవ‌డం కేసీఆర్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌ని ఈ నిర్ణ‌యంతో మ‌రోసారి ఆయ‌న నిరూపించుకున్నారు. కేసీఆర్ వేగం, వ్యూహాలు చూస్తుంటే బ‌హుశా వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో ఆయ‌న పార్టీకి ఎదురుండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న‌రాజ‌కీయ ముఖ‌చిత్రం.