2019 లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం

`నొప్పించ‌క తానొప్ప‌క త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు`.. ఇది రాజ‌కీయాలకు స‌రిగ్గా స‌రిపోతుంది, ముఖ్యంగా సీఎం చంద్రబాబు వంటి వారికి బాగా న‌ప్పుతుంది! అధికారం శాశ్వ‌తంగా ఉండిపోవాల‌నే త‌ప‌న‌ ఎంత ప‌ని అయినా చేయిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు! ఇప్పుడు చంద్ర‌బాబు కూడా చేస్తున్న‌ది కూడా అదే!! ఎవ‌రిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బ‌హుశా ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు! పార్టీ వ్య‌తిరేకి అన్న‌ ముద్రవేసిన హ‌రికృష్ణ వ‌ర్గాన్ని.. ఇప్పుడు అక్కున చేర్చుకునేందుకు చంద్ర‌బాబు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. హ‌రికృష్ణ ద్వారా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మ‌చ్చిక చేసుకునేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

రాజకీయ వ్యూహాల విషయంలో చంద్రబాబును డీకొట్ట గ‌ల నాయకుడు తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు. ప్ర‌స్తుతం ఆయ‌న 2019 ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి రాజకీయ వ్యూహాలను ఇప్పటి నుంచే అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని పవన్ కళ్యాణ్ కంటే తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్‌కి రాకుండా చేయాలన్నదే ఆయ‌న వ్యూహం. ఆ స్థానంలో పవన్ ఉండాలని కోరుకుంటున్నారు. త‌న‌యుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కూడా చంద్రబాబుకు అది చాలా అవసరం.

2019లో తాను మళ్ళీ అధికారంలోకి రావడానికి అవసరమైన అస్త్ర శస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు! ఈ సారి మోడీ, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సపోర్ట్ ఉండే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. 2014లో ఉన్న రెండు శక్తులు లేకుండా పోతున్న దృష్ట్యా ఇప్పుడు ఎన్టీఆర్‌ని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. తన రాజకీయ అవసరాల రీత్యా 2009లో ఎన్టీఆర్‌ని రంగంలోకి దించారు. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడ్డాడు. అయినప్పటికీ లోకేష్‌కి పోటీ అవుతాడన్న ఒకే ఒక్క ఉద్ధేశంతో ఎన్టీఆర్‌ని దూరం పెట్టేశారు.

కెరీర్‌కి పరంగా న‌ష్టం చేకూర్చినా.. మళ్లీ సూపర్ క్రేజ్‌తో టాప్ రేంజ్‌కి వచ్చేశాడు ఎన్టీఆర్. అదే టైంలో టీడీపీ  వారసత్వం లోకేష్‌కే అన్న స్పష్టతని కూడా పార్టీలో ఉన్న నాయకులకు ఇచ్చేశారు చంద్ర‌బాబు! ఇక ఇప్పుడు 2019 ఎన్నికల కోసం ఎన్టీఆర్‌ని మరోసారి టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు. హరికృష్ణకు ప్రాధాన్యాన్నిపెంచేశాడు. పొలిట్ బ్యూరో సమావేశాలకు హాజరయ్యేలా చేస్తున్నాడు. నారా లోకేష్ కూడా ఎన్టీఆర్‌తో రాయబారం నడుపుతు న్నాడు. 2019లో టీడీపీ త‌రఫున ప్రచారం చేయడానికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించే ప్రయత్నాలు సీరియ‌స్‌గా జ‌రుగుతున్నాయి. మ‌రి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే!!