2019 బెజ‌వాడ టీడీపీ ఎంపీ సీటు మూడు ముక్క‌లాటేనా..!

ఏపీలో రాజ‌కీయ చైత‌న్యానికి పురిటిగ‌డ్డ కృష్ణా జిల్లా. ఇక బెజ‌వాడ రాజ‌కీయం తెలుగు రాష్ట్రాల్లోనే ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీ అయ్యేందుకు వివిధ పార్టీల త‌ర‌పున ఎంపీ సీటు ద‌క్కించుకునేందుకు అక్క‌డ నాయ‌కులు చేయ‌ని ప్ర‌య‌త్నాలు అంటూ ఉండ‌వు. ఏపీలో విజ‌య‌వాడ ఎంపీ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక్క‌డ నుంచి ఎంతోమంది మ‌హామ‌హులు, పారిశ్రామిక‌వేత్త‌లు లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.

2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ల‌గ‌డ‌పాటి ఆ త‌ర్వాత క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరమ‌య్యారు. ప్ర‌స్తుతం టీడీపీ నుంచి కేశినేని నాని ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీలో విజ‌య‌వాడ ఎంపీ సీటు ఎవ‌రికి ద‌క్కుతుంది అన్న‌దే పెద్ద సందేహంగా మారింది. వాస్త‌వంగా చూసుకుంటే సిట్టింగ్ ఎంపీ నానికే టిక్కెట్టు రావాలి….అయితే ఇటీవ‌ల చంద్ర‌బాబుకు నానికి గ్యాప్ బాగా పెరిగిపోయింది.

గ‌తంలో మంత్రి ఉమాపై ఓపెన్‌గానే విమ‌ర్శ‌లు చేసిన నానికి చంద్ర‌బాబు చీవాట్లు పెట్టారు. ఇక రీసెంట్‌గా ఆర్టీఏ కార్యాలయం వివాదంతో వీరిద్ద‌రి మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్‌ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక కొద్ది రోజుల క్రితం వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ సీటును చంద్ర‌బాబు త‌న కోడ‌లు నారా బ్రాహ్మ‌ణికి ఇస్తారంటూ కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇవ‌న్నీ కూడా నానిలో అభ‌ద్ర‌తా భావాన్ని పెంచిన‌ట్టు తెలుస్తోంది.

ఇక రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ వెల‌గ‌పూడిలో స‌చివాల‌యంలో చంద్ర‌బాబుతో ఏకంగా 40 నిమిషాల పాటు భేటీ కావ‌డం….చంద్ర‌బాబు విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్టు కోసం రాజ్‌గోపాల్ పేరు కూడా ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు రావ‌డంతో అస‌లు విజ‌య‌వాడ ఎంపీ సీటు రాజ‌కీయం ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే హీటెక్కేసింది. త‌న‌కు ప్ర‌త్య‌ర్థి అయిన రాజ్‌గోపాల్‌ను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.