మూడేళ్ల పాలనలో మోడీ విఫలమా ? సఫలమా?

 

అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్‌కు ప్ర‌ధాని ప‌ద‌వి అతి పెద్దది! ఈ దేశం మొత్తాన్ని పాలించ‌గ‌లిగిన ఏకైక ప‌ద‌వి ఇదే. అంత‌పెద్ద ప‌ద‌విని చేప‌ట్టి.. బీజేపీ సీనియ‌ర్ నేత న‌రేంద్ర మోడీకి మూడేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో ఏడాదిన్న‌ర‌లోనే సార్వ‌త్రిక స‌మ‌రం సిద్ధం కానుంది. ఈ క్ర‌మంలో ఈ మూడేళ్ల పాల‌న‌ను త‌ర‌చి చూస్తే.. స్థూలంగా మోడీ ఈ దేశ ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమిటి?  ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు స‌ఫ‌ల‌మ‌య్యాయా?  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఎలా ఉన్నాయి?  మొత్తంగా ప్ర‌ధానిగా ఆయ‌న స‌క్సెస్ అయ్యారా?  సైలెంట్‌గా విఫ‌ల‌మ‌య్యారా? అనేది ప్ర‌స్తుతం జ‌రుగుత‌న్న చ‌ర్చ‌.

ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్టిన కొత్త‌లో జ‌న్‌ధ‌న్ యోజ‌న అంటూ పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలు తెరిపించారు. త‌ర్వాత స్వ‌చ్ఛ భార‌త్ అంటూ జ‌నాల‌తో చీపుర్లు ప‌ట్టించారు. ఆ త‌ర్వాత పెద్ద నోట్ల ర‌ద్దు అంటూ ప్ర‌జ‌ల‌ను బ్యాంకుల ముందు క్యూ క‌ట్టించారు. ఇక‌, గ‌తంలో తామే వ్య‌తిరేకించిన జీఎస్టీ విధానాన్నిఅతి పెద్ద నిర్ణ‌యంగా చారిత్రాత్మ‌క నిర్ణ‌యంగా త‌ల‌కెత్తుకున్నారు. గ్యాస్ స‌బ్సిడీల‌ను ఎత్తేశారు. పెట్రోల్ ధ‌ర‌ల‌ను అమాంతం రోజూ పెంచుకునే వెసులుబాటు క‌ల్పించారు. పేద‌ల‌కు రుణాల‌ను క‌ఠిన‌తరం చేశారు. రైతుల‌కు రుణ‌మాఫీ అంశం కేంద్రం ప‌రిధిలోది కాద‌ని నిస్సిగ్గుగా ప్ర‌క‌టించుకున్నారు. 

ఇంత జ‌రిగి.. ఈ మూడేళ్ల‌లో ఈ దేశానికి ఒరిగింది ఏమిటి? అని ఆలోచిస్తే.. శూన్యం! మోదీ పాల‌న మేడిపండు పాల‌ననే గోచ‌రింప జేసింది. సొంత పార్టీ సీనియ‌ర్ నేతే నిన్న‌టికి నిన్న నిప్పులు చెరిగారు. మోదీ తీసుకున్న నోట్ల ర‌ద్దు విష‌యం చాప కింద నీరులా ఈ దేశాన్ని తిరోగ‌మ‌నం ప‌ట్టిస్తోంద‌న్నారు. జీఎస్టీ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని నిప్పులు చెరిగారు. వెర‌సి మూడేళ్ల పాల‌న‌పై ముఖ స్తుతి చేస్తున్న నేత‌ల‌కు ఈ విష‌యాలు అన్నీ తెలుసున‌ని, కానీ అంద‌రూ మోడీకి భ‌య‌ప‌డుతున్నార‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు య‌శ్వంత్ సిన్హా! 

మోడీ పాల‌న‌లో బ్యాంకులు బ‌లోపేత‌మైన మాట వాస్త‌వం. వినియోగ‌దారుల ర‌క్తాన్ని అవి రుచిమ‌రిగాయి. డ‌బ్బులు వేస్తే.. చార్జీ, తీస్తే చార్జీ, దాచుకుంటే చార్జీ.. డ‌బ్బులేకుంటే చార్జీ ఇలా అయిందానికీ కానిదానికీ వినియోగ‌దారుల‌ను పీడించ‌డం ప్రారంభించాయి. రైతుల‌కు రుణ మాఫీ విష‌యంలో గ‌తంలో కేంద్రం అంతో ఇంతోస్పందించేది ఇప్పుడు మోడీ మౌనం క‌న్నా ఏమీ చేయ‌డం లేదు. కేవ‌లం మోడీ ప్ర‌భ‌తోనే ప్ర‌భుత్వం న‌డిపించినా.. అది మెర‌మెచ్చు ఘ‌ట‌న‌ల, ప్ర‌క‌ట‌న‌ల స‌మాహారంగానే క‌నిపిస్తోంది. ఇప్పుడు న‌లుదెశ‌లా.. ప‌రిస్థితి తీవ్ర‌మైంది. 

నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కొండెక్కాయి. పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఏదీ ఉచితం కాదంటూ ప్ర‌భుత్వాలు బోర్డులు పెట్టాయి. చౌక ధ‌ర‌ల దుకాణాలు మూత‌బ‌డ్డాయి. వెర‌సి మోడీ పాల‌న‌.. వైఫ‌ల్యం సాక్షాత్క‌రిస్తోంది. ఎవ‌రు ఎన్ని రంగులు పులిమినా.. కాకి రంగును ఎన్నాళ్లు దాచ‌గ‌ల‌రు! అదే ఇప్పుడు జ‌రిగింది. భ‌విష్య‌త్తులో మ‌రింత ఆగ్ర‌హ జ్వాల‌లు పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.