షాక్‌: 40 మంది ఎమ్మెల్యేలు జంప్‌

స‌మస్య‌కు ప‌రిష్కారం దొరికిన చోటే మ‌రో కొత్త స‌మ‌స్య ప్రారంభ‌మ‌వుతుంది. దీనికి సరైన ఉదాహ‌ర‌ణే త‌మిళ‌నాడు పాలిటిక్స్‌! చైన్నై థ్రిల్ల‌ర్ సినిమాకు అప్పుడే క్లైమాక్స్ ప‌డేలా క‌నిపించ‌డం లేదు. సీఎం పీఠం కోసం జ‌రుగుతున్న కుర్చీలాట‌లో.. ఎన్నో ట్విస్టులు, మ‌రెన్నో మ‌లుపులు! ఎవ‌రు ఎవ‌రివైపు ఉంటారో.. ఎవ‌రు వ్య‌తిరేక వ‌ర్గంవైపు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి! అమ్మ మ‌ర‌ణంతో మొద‌లైన ఈ సంక్షోభం.. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఈపీఎస్‌-ఓపీఎస్ వ‌ర్గాల విలీనంతో ఒక స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వ‌గా.. ఆ త‌ర్వాతి రోజు నుంచే మ‌రో కొత్త స‌మ‌స్య తెర‌పైకి వచ్చింది. ఈపీఎస్ నిర్వ‌హించిన కీల‌క స‌మావేశానికి 40 ఎమ్మెల్యేల గైర్హాజ‌రు స‌రికొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తోంది.

వర్గ పోరుకు చెక్‌ పెడుతూ ముఖ్యమంత్రి పళని సామి, పన్నీర్‌ సెల్వంలు విలీన నిర్ణయం తీసుకోగానే తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. శశికళ, ఆమె వర్గీయులపై వేటు వేయటమే ప్రధాన ఉద్ధేశంగా రొయపెట్టాలో నిర్వహిస్తున్న కీలక సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో పళని, పన్నీర్‌లలో కొత్త టెన్షన్‌ మొదలుకాగా, పార్టీలో సంక్షోభం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శశికళ బంధువు దినకరన్‌ టీవీవీ దినకరన్‌ తన వర్గ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండాను ఎగరవేయగా ప్రస్తుతం సుమారు 22 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని విండ్‌ఫ్లవర్‌ రిసార్ట్‌లో సేదతీరుతున్నారు.

రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని, తామంతా దినకరన్‌ వెంటే నడుస్తామ ని ఎమ్మెల్యే తంగ తమిళసెల్వన్‌ స్పష్టం చేశారు. పళని-పన్నీర్‌ వర్గంలో మరింత మంది స్లీపర్‌ సెల్స్ ఉన్నారని, వారంతా త్వరలో దినకరన్‌ గూటికి చేరతారన్నారు. ఇక పళని స్వామి సహా నేతలంతా కీలక బాధ్యతల నుంచి తొలగిస్తూ వస్తున్న దినకరన్‌.. ఇప్పుడు మరొకరిపై వేటు వేశారు. విద్యుత్‌ శాఖ మంత్రి పి తంగమణిని నమక్కల్‌ జిల్లా సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ ఆ స్థానంలో అనబఝన్‌ను నియమించారు. కాగా, ప్రతిపక్ష డీఎంకే పార్టీతో టీవీవీ దినకరన్ చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత సుబ్రమణియన్‌ స్వామి వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ నుంచి కొందరు శకునిలు పళని-పన్నీర్‌లను ఒక్కటి చేసేందుకు తీవ్రంగా యత్నించాయని, కానీ వారి ఆటలు సాగకపోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. ఇంకోవైపు దినకరన్‌కు మద్ధతు ఇస్తున్న 19 మంది ఎమ్మెల్యేలతోపాటు గుట్కా స్కాం అంశాన్ని వెలుగులోకి తెస్తూ డీఎంకేలోని 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ పళని ప్రభుత్వం స్పీకర్‌ను కోరే అవకాశం ఉందని, తద్వారా సభలో కోరంను తగ్గించవచ్చనే ఆలోచన చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి త‌మిళ రాజ‌కీయాలు ఏ మ‌లుపు తీసుకుంటాయోన‌నేది ఇప్పుడు ఆస‌క్తికరంగా మారింది.