చంద్ర‌బాబు అభివృద్ధిని ప‌రోక్షంగా ఒప్పుకున్న అంబ‌టి

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఎప్ప‌టిక‌ప్పుడు ఫైర‌య్యే వైసీపీ అధికార ప్ర‌తినిధ అంబ‌టి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా పొడిగేశాడు అంబ‌టి. నాలుగు రోజుల కింద‌ట ముగిసిన మహానాడులో లోకేష్‌, చంద్ర‌బాబు ల ప్ర‌సంగాల‌కు కౌంట‌ర్‌గా అంబ‌టి మాట్లాడారు. అయితే, ఆయ‌న తిడుతున్నాను అనుకుని బాబు పాల‌న‌ను పెద్ద ఎత్తున పొగ‌డ‌డమేకా కుండా బాబు చెబుతున్న విష‌యాల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించేశాడు. అవేంటో చూద్దాం.

హైద‌రాబాద్ లో అంబ‌టి మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పై విమ‌ర్శ‌లు చేశారు. మ‌హానాడులో లోకేష్ మాట్లాడ‌టానికి వెళ్తుంటే చంద్ర‌బాబు ముఖంలో ఆందోళ‌న క‌నిపించంద‌న్నారు. స‌రిగా మాట్లాడ‌టం రాని వ్య‌క్తి, జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఓకే.. ఇంత‌వ‌ర‌కూ బాగానే విమ‌ర్శించారు అనుకుందాం. అభివృద్ధికి కొల‌మానంగానే జీడీపీని చెబుతార‌నీ, ఆంధ్రాలో 12.7 శాతం వృద్ధి సాధిస్తున్న‌ప్పుడు రాష్ట్ర అభివృద్ధికి జ‌గ‌న్ ఎక్క‌డ అడ్డుప‌డుతున్న‌ట్టు అని ప్ర‌శ్నించారు. జీడీపీని ఎక్కువ‌గా చూపించి అప్పులు తెస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఆంధ్రాకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీపై త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని అంబ‌టి అన్నారు. ఇక్క‌డే అంబటి పూర్తిగా బోల్తా ప‌డ్డారు. జ‌గ‌న్ అభివృద్ధి నిరోధ‌కుడు అంటున్న టీడీపీకి చెప్పాల్సిన స‌మాధానం ఇది కాదు క‌దా! 12.7 వృద్ధి రేటును తెలుగుదేశం స‌ర్కారు సాధించింద‌ని ప‌రోక్షంగా ఒప్పుకుంటున్న‌ట్టే అంబ‌టి వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక‌, జీడీపీని అధికంగా చూపించి అప్పులు తెస్తున్నార‌న్నారు! అదీ ఓర‌కంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల‌మైన వ్యాఖ్యే! రాష్ట్రం పేద‌రికంలో ఉంది కాబ‌ట్టి, ఎలాగోలా అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నార‌ని చెబుతున్న‌ట్టుగానే ఉంది. సో.. అంబ‌టి ఏదో టీడీపీని ఇర‌కాటంలోకి నెట్టేయాల‌ని భావిస్తూ.. ప‌రోక్షంగా వైసీపీని ఇరుకున పెట్టుకున్నాడ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.