అమిత్‌షా.. అత్యాశ యాత్ర‌..!

June 13, 2018 at 8:34 am
amit shah

ఆరు రాష్ట్రాలు.. 120 స్థానాలు.. ఇదీ వ‌చ్చే లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో  బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా టార్గెట్‌..!  ఈ టార్గెట్‌ను చేరుకునేందుకు ఆయ‌న ఈనెల 7న ప‌ర్య‌ట‌న ప్రారంభించారు.. అమిత్‌షా మూడు నెల‌ల‌పాటు తీవ్ర క‌స‌ర‌త్తు చేసి ఎన్నిక‌ల్లో విజ‌యానికి రూట్‌మ్యాప్ రూపొందించిన‌ట్లు తెలిసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా సుమారు ప‌దినెల‌ల స‌మ‌యం ఉండ‌గానే..క‌మ‌ల‌ద‌ళం క‌స‌ర‌త్తు చూస్తుంటే  ఎంత‌ప‌ట్టుద‌ల‌గా ముందుకు వ‌స్తుందో అర్థ‌మ‌వుతుంది. కానీ.. ద‌క్షిణాది నాలుగు రాష్ట్రాల‌తోపాటు ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్‌లో అమిత్‌షా ప‌ర్య‌ట‌న కొన‌సాగనుంది. ఈ ఆరు రాష్ట్రాల్లోనూ బీజేపీయేత‌ర పార్టీలే అధికారంలో ఉన్నాయి. 

 

2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న తెలిసిందే. ఆరేడు స్థానాల‌కంటే ఎక్కువ‌సీట్లు గెల‌వ‌లేక‌పోయింది. ఈసారైనా ద‌క్షిణాది రాష్ట్రాల్లో అత్య‌ధిక సీట్లు సాధించి త‌మ‌కు ఇక తిరుగులేద‌ని నిరూపించుకోవాల‌న్న వ్యూహంతో అమిత్‌షా వ‌స్తున్నారు. బీజేపీ టార్గెట్ చేసిన ఈ ఆరు రాష్ట్రాలు ఏవంటే… కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, ఒడిశా, ప‌శ్చిమబెంగాల్‌. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి కొరుకుడు పడ‌ని పార్టీలే అధికారం ఉన్నాయి. అంతేగాకుండా.. భావ‌జాల‌ప‌రంగా కూడా ఆ పార్టీకి దూరంగా ఉన్న రాష్ట్రాలే. ఇలా పూర్తి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్న రాష్ట్రాల్లో అమిత్‌షా  ఏం చేయ‌బోతున్నార‌న్న‌ది ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తిరేపుతోంది. 

 

ఎందుకంటే… గ‌తంలో పెద్ద‌గా ప‌ట్టులేని త్రిపుర‌లో కూడా క‌మ‌లం పార్టీ ఐదారు నెల‌ల్లోనే రాష్ట్రాన్ని క‌మ్యూనిస్టుల నుంచి లాక్కుంది. ప్ర‌ధానంగా క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతం.. క్యాడ‌ర్‌ను పుర‌మాయించ‌డంపై పార్టీ దృష్టిసారించాల‌న్న‌ది అమిత్‌షా వ్యూహంగా క‌నిపిస్తోంది. పార్ల‌మెంటు, అసెంబ్లీ క్ల‌స్ట‌ర్ల ముఖ్యుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ.. స్థానిక ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా వ్యూహాలు ర‌చిస్తూ జూలై 20వ‌ర‌కు అమిత్‌షా ముందుకుసాగ‌నున్నారు.కానీ.. అమిత్‌షాది అత్యాశ యాత్ర‌గానే మిగిలిపోతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

 

ద‌క్షిణాదిన పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ క‌ల‌లు క‌ల్ల‌లుగానే మిగిలిపోతున్నాయి. క‌ర్ణాట‌క‌లోనూ అధికారానికి కొద్దిపాటి దూరంలోనే ఆగిపోయింది. ఇక తెలంగాణ‌లోనూ పార్టీ అక్క‌డ‌క్క‌డ బ‌లంగా ఉన్నా.. టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురునాయ‌కులు అంటున్నారు. ఈనెల 22న అమిత్ హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. ఏపీలోనూ క‌మ‌ల‌ద‌ళానికి ఎదురుగాలి వీస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేసింద‌న్న విష‌యాన్ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు జ‌నంలోకి తీసుకెళ్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ నేత‌ల ప‌రిస్థితి అయోమ‌యంగా త‌యారైంది. చంద్ర‌బాబు దూకుడును త‌ట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

 

అదేవిధంగా త‌మిళ‌నాడులోనూ బీజేపీది అంతంత‌మాత్ర‌మే. ఇప్ప‌టికే అక్క‌డ రోజుకొక పార్టీ పుట్టుకొస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలు హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. బీజేపీకి కొంత అన్నాడీఎం ద‌గ్గ‌ర‌గా ఉన్నా.. ఎప్పుడేం జ‌రుగుతుందో తెలియ‌దు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్య‌ప‌రిణామాల నేప‌థ్యంలో కొత్త‌కొత్త పార్టీలు ఏర్ప‌డ్డాయి. స్టార్ హీరో క‌మ‌ల‌హాస‌న్ పార్టీ పెట్టారు. ర‌జినీకాంత్ కూడా కొత్త పార్టీ పెడుతున్నారు. అన్నాడీఎంకే నుంచి విడిపోయిన దిన‌క‌ర‌న్, శిశిక‌ళ సోద‌రుడు కూడా మ‌రో పార్టీ పెట్టారు. 

 

ఇటీవ‌ల స్టెరిలైట్ రాగి క‌ర్మాగారం ఘ‌ట‌న అన్నాడీఎంకే ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌కొట్టింది. డీఎంకే నేత స్టాలిన్ కూడా బ‌లంగానే ఉన్నారు. ఇక ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్‌నే బీజేపీ ఈ మ‌ధ్య కొంత బ‌లంగా ఉన్న‌ట్లు ప‌లువురు నాయ‌కులు భావిస్తున్నారు. బీజేడీ నేత‌, ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీని త‌ట్టుకుని బీజేపీ నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీయేత‌ర కూట‌మిలో మ‌మ‌తా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 

అమిత్‌షా.. అత్యాశ యాత్ర‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share