తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా

ద‌క్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ‌, ఏపీలో ఎలాగైనా పాగా వేయాల‌ని ప‌క్కా ప‌థ‌కంలో ఉన్నారు క‌మ‌ల నాథులు. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌లుకుతూ.. ఇద్ద‌రూ క‌ల‌సి ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. ఇక‌, తెలంగాణలోనే ప‌రిస్థితి అర్ధం కావ‌డం లేదు. ఏపీ క‌న్నా తెలంగాణ‌లో ఒకింత బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్ర‌మంలోనే 2019లో ఎలాగైనా స‌రే తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని బీజేపీ నేత‌లు ప‌ట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్ ఎస్‌ను టార్గెట్ చేసుకున్నారు.

ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌ర్య‌టించిన క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఎక్కువ స‌మ‌యం అంటే మూడు రోజుల పాటు తెలంగాణ‌లోనే మ‌కాం వేసి మ‌రీ పాలిటిక్స్‌ను ర‌క్తి క‌ట్టించారు. కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. కేంద్రం ఇస్తున్న నిధుల‌ను ఖ‌ర్చు చేయడం లేద‌ని, కేంద్ర ప‌థ‌కాల‌ను స‌రిగా అమ‌లు చేయ‌డం లేద‌ని, మ‌రుగు దొడ్ల నిర్మాణం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంద‌ని ఫైర‌య్యారు. ఇక‌, అంత‌టితో ఆగ‌కుండా బ‌హిరంగ స‌భ‌లోనూ విరుచుకుప‌డ్డారు. అనంత‌రం ఢిల్లీ వెళ్లిపోయారు.

అయితే, షా ఇంతగా దుమ్మ‌దులిపేశాక‌.. కేసీఆర్ ఊరుకుంటారా? అస‌లే ఉద్య‌మ ర‌క్తం కావ‌డంతో అదే సిరీస్‌లో షాపై ఎక్కి దిగారు. లెక్క‌ల స‌హితంగా షా విమ‌ర్శిస్తే.. అంత‌క‌న్నా ప‌దునుగా కేసీఆర్ దుమ్మురేపారు. ఇక‌, ఈ క‌థ అంత‌టితో అయిపోయింద‌ని, ఏదైనా ఉంటే ఎన్నిక‌ల ముందు ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, తాజా ప‌రిణామాలు మాత్రం షా.. కేసీఆర్‌పై ప‌గ సాధిస్తున్నాడ‌నేలా ఉన్నాయి. ఈ ఏడాది వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిదులను విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన ప్రాంతాలకు జిల్లాకు 50 కోట్ల చొప్పున 450 కోట్ల రూపాయలు ఇవ్వాలంది.

అయితే ఇక్కడే తిరకాసు పెట్టింది కేంద్రం. గతేడాది విడుదల చేసిన నిధులకు సంబందించి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పిస్తేనే నిధులు విడుదల అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సర్టిఫికెట్లు పంపినా మరిన్ని వివరాలు కావాలని ఈ స్కీమ్ కింద వేసిన రోడ్ల పొడవుతో సహా సమాచారం అంతా కావాలని కేంద్రం కోరిందట. దీంతో చేసేదేం లేక అధికారులు ఆ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. గత ఏడాది మాత్రం అంతకు ముందు సంవత్సరానికి యుటిలైజేష్ సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా నిధులు ఇచ్చిన కేంద్రం… ఇప్పుడు మాత్రం కండీషన్ లు పెడుతోంది. సో… ఇదంతా చూస్తుంటే.. కేసీఆర్‌పై షా తీర్చుకుంటున్న రివేంజేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.