అమిత్‌షాపై టి-బీజేపీ నేత‌ల గుస్సా!

తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోక‌స్ పెట్టింది. అక్క‌డ‌ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించి శ్రేణుల‌కు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీలోని సీనియ‌ర్ నేత‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ట‌. ఆయ‌న వ్యూహాల‌తో త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుందో ద‌క్క‌దోన‌ని టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వానికి ప్రాధాన్య‌మిచ్చేలా అమిత్ షా నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌టంతో.. దిక్కుతోచ‌ని స్థితిలో సీనియ‌ర్లు ప‌డిపోయార‌ట‌.

దక్షిణాదిలో తమ జైత్రయాత్రను తెలంగాణ నుంచే ప్రారంభిస్తామ‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్ర‌క‌టించారు. ఇప్పుడు వెంట‌నే ప‌ని ప్రారంభించేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా ఆయ‌నే స్వ‌యంగా స్వీకరిస్తున్నారట. ఇందులో భాగంగా తీసుకు న్న నిర్ణ‌యంతో బీజేపీ సీనియ‌ర్ల‌కు గొంతులో వెల‌గ‌పండు ప‌డిన‌ట్టు అయింద‌ట‌. మూడుసార్లు ఒకే నియోజకవర్గంలో పోటీ చేసి తక్కువ ఓట్లు వచ్చిన వారిని పక్కన పెట్టాలనే నిర్ణ‌యిచ‌డంతో నేత‌లు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీటు గ్యారెంటీ అని భావించిన వీరి ఆశ‌లు ఆవిరైపోయాయి.

సీనియర్ నేతలు పార్టీని పట్టించుకోవడం లేదని, సెకండ్ లెవెల్ క్యాడర్ మాత్రమే పార్టీ కోసం పనిచేస్తుందని, వారికి పెద్దపీట వేయాలని అమిత్ షా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ బీజేపీ నేతల్లో భయం పట్టుకుంది. గత మూడు ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓట్లు రాని వారిని కేవలం పార్టీ ప్రయోజనాలకే వినియోగించుకుంటామని, ఎన్నికల్లో అవకాశమివ్వమని తేల్చిచెప్పేశారు షా. దీంతో తెలంగాణ బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా దీటైన అభ్యర్థుల కోసం అమిత్ షా ప్రత్యేక టీంల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. తన సొంత మనుషులనే ఇందుకు వినియోగిస్తున్నారు.

ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలపై అమిత్ షా కన్నేసినట్లు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎవరు పోటీ చేశారు? విజేతలకు మనకు తేడా ఎంత? వంటి విషయాలపై సమాచారం సేకరిస్తున్నార‌ట‌. దీనిపై నేత‌ల వాద‌న మ‌రోలా ఉంది. మూడుసార్లు ఓడితే టిక్కెట్ ఇవ్వకపోతే ఎలా? ఉమ్మడి రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ఎంతో తేడా ఉంటుందని,..ఇప్పుడు మోదీ గాలి బలంగా వీస్తున్నందున కొందరు నేతలు అమిత్ షా వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని స‌మాచారం! మ‌రి వీరి మొర షా ఆల‌కిస్తారో లేదో!!