గ్రూప్ రాజకీయాల దెబ్బ… కిష‌న్‌రెడ్డికి అమిత్ షా క్లాస్

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువ‌రించేందుకు ప్ర‌తిప‌క్షాలు నానా చెమ‌ట‌లు కక్కుతున్నాయి. తెలంగాణ‌లో సొంతంగా ఎద‌గ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీలో స‌మ‌ష్టిత‌త్వం పూర్తిగా కొర‌వ‌డింది. తెలంగాణ బీజేపీకి బ‌లం త‌క్కువ, నాయ‌కులు ఎక్కువ అన్న చందంగా ఉంది. పార్టీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల మ‌ధ్య కూడా స‌రైన స‌ఖ్య‌త లేదు. కిష‌న్‌రెడ్డి ఓ వ‌ర్గం, పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ల‌క్ష్మ‌ణ్ మ‌రో వ‌ర్గం, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే చింత‌ల రామచంద్రారెడ్డి మ‌రో వ‌ర్గం అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర‌మంత్రిగా ఉన్న బండారు ద‌త్తాత్రేయ‌కు కిష‌న్‌రెడ్డికి పొస‌గ‌దు. ఇక పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్‌రావు అంద‌రితో స‌ఖ్య‌త‌గానే ఉన్నా త‌న‌కంటూ స‌ప‌రేట్ వ‌ర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అస‌లే రాష్ట్ర‌వ్యాప్తంగా చాలా జిల్లాల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇప్ప‌ట‌కీ సంస్థాగ‌తంగా బ‌లం లేదు.

పార్టీని రాష్ట్ర‌వ్యాప్తంగా సంస్థాగ‌తంగా ఎలా స్ట్రాంగ్ చేయాల‌ని ఆలోచించ‌కుండా ఎవ‌రికి వారు గ్రూపు రాజ‌కీయాల‌తో కుమ్ములాట‌ల‌కు దిగ‌డంతో ఈ విష‌యం చివ‌ర‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌ద్ద‌కు చేరింది. తాజాగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అమిత్ షా కిష‌న్‌రెడ్డిని త‌న గెస్ట్ హౌస్‌కు పిలిపించుకుని క్లాస్ పీకిన‌ట్టు స‌మాచారం. అల‌క‌లు మంచిది కాదు..అల‌క‌ల‌తో పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌డం మిన‌హా ఒరిగేదేమి ఉండ‌దు..అంద‌రిని క‌లుపుకుని పోవాల‌ని షా కిష‌న్‌రెడ్డికి గ‌ట్టిగా సూచించిన‌ట్టు స‌మాచారం.