`అనంత` పోస్టుకి నేతలు పోటా పోటీ

ఒకే ఒక్క పోస్టు కోసం అనంత‌పురం టీడీపీ నేత‌లు సిగ‌ప‌ట్లు ప‌ట్టుకుంటున్నారు. అమ‌రావ‌తికి తెగ చ‌క్కెర్లు కొడుతున్నారు. అధ్య‌క్షుడి మెప్పు పొంది.. ఆ ప‌ద‌విని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని ఎవ‌రికి వారు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో త‌మ‌కు తెలిసిన నేత‌ల‌తో లాబీయింగ్ చేయిస్తున్నారు. అంతేగాక ఆ ప‌ద‌వి ఇస్తే జీతం అక్క‌ర్లేద‌ని.. ఫ్రీగా స‌ర్వీస్ చేసుకుంటామని కూడా చెప్పేస్తున్నారు. ఇంత‌కీ ఆ ప‌ద‌వి ఏంటంటే.. అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(అహుడా) చైర్మ‌న్‌!! మ‌రి ఈ ప‌ద‌వికి ఎందుకింత క్రేజ్‌? నేత‌లంతా ఎందుకు ఇలా ఓపెన్ ఆఫ‌ర్లు ఇచ్చేస్తూ.. కుస్తీప‌డుతున్నారో మాత్రం అంతుచిక్క‌ని అంశ‌మే!

అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. అహుడాని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. అనుకున్నదే తడవుగా అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఒక గదిలో ఆఫీసును తెరిచారు. పదికోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేశారు. వైఎస్ ఛైర్మన్‌గా కమిషనర్ మూర్తికి బాధ్యతలు అప్పగించి, సిబ్బందిని కూడా నియమించారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలను కలుపుకొని ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పన కోసం అహుడా పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. కానీ ఇంత‌వ‌రకూ దీనికి చైర్మ‌న్‌గా ఎవ‌రినీ నియ‌మించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం!

ప్రభుత్వం ఎవరో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంది. ఈ పదవిని దక్కించుకోవడానికి తెలుగుదేశం నేతలు కుస్తీ పడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఈ పదవి ఇచ్చేది లేదని అధిష్టానం చెప్పినట్టు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో ద్వితీయశ్రేణి నేతలంతా ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అనంతపురానికి చెందిన శింగవరం రవీంద్రనాయుడు అలియాస్‌ ముళ్లపూడి రవీంద్ర ఈ పోస్టును ఆశిస్తున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ద్వారా అధినేతకు సిఫారస్సు చేయించే పనిలో ఉన్నారు. తనకు పదవి ఇస్తే ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా కష్టపడి పనిచేస్తానని ఆయన చెబుతున్నారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బాంబే డయింగ్ నాగన్న, ఎమ్మెల్సీకి ప్రయత్నం చేసిన గడ్డం సుబ్రమణ్యం, వీరాంజనేయులు తదితరులు కూడా ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ సైఫుల్లా తనయుడు కేఎం జకీవుల్లా కూడా బరిలో ఉన్నారు. లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ బలిజ సామాజికవర్గానికి చెందిన ఆదెన్నను అహుడా అధ్యక్షుడిగా ప్రతిపాదించడానికి నేతలంతా సిద్ధపడుతున్నట్టు సమాచారం. కదిరికి చెందిన న్యాయవాది రాజశేఖర్, హిందూపురానికి చెందిన నెట్టెప్ప, వీరాంజనేయులు తదితరులు కూడా జాబితాలో ఉన్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని పేరును కూడా ముందుకు తెస్తున్నారు. వీరితో ఎవ‌రికి ఈ పోస్టు దుక్కుతుందో!!