ఆంధ్రాలో తెలంగాణ వాదం వ‌దిలేసిన ఎంపీ క‌విత‌..!

తెలంగాణ ప్రాంతీయ వాదం, సాహిత్యాన్ని, క‌ళ‌ల‌ను, సంస్కృతి. సంప్ర‌దాయాల‌ను ప్ర‌జల్లోకి తీసుకెళ్ల‌డంలో కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత ఎప్పుడూ ముందుంటారు. ఏ వేదిక అయినా, ఎక్క‌డ‌యినా ఆమె ఈ అంశాల‌పై అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. అయితే ఇప్పుడు అమ‌రావ‌తిలో ఏర్పాటుచేసిన జాతీయ మ‌హిళా పార్ల‌మెంటుకు హాజ‌రైన ఆమె.. త‌న ప్ర‌సంగంలో ఎక్క‌డా వాటి జోలికి పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఎక్క‌డ‌యినా తెలంగాణ వాదాన్ని భుజాన కెత్తుకునే ఆమె.. ఈసారి అలా చేయ‌క‌పోవ‌డంపై ఇప్పుడు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

న‌వ్యాంధ్ర రాజధాని అమరావతి వెళ్లిన సందర్భంగా చేసిన ప్రసంగం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. తాను సభలోకి వస్తున్నప్పుడు గురజాడ అప్పారావు మాటలు గుర్తుకు వచ్చయన్న ఆమె.. తన ప్రసంగంలో భాగంగా దూబగుంట్ల రోశమ్మను గుర్తు చేసుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే ఆమెప్రస్తావించిన రెండు పేర్లు ఆంధ్రా ప్రాంతానికి చెందినవి కావటమే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ యాసకు.. గోసకే తమ పట్టమంటూ గళం విప్పిన మాటలు విన్న‌ప్పుడు నిజమే కదా? అని చాలామంది అనుకునే పరిస్థితి.

ప్ర‌స్తుతం తెలంగాణ  ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ను.. తెలంగాణ పూర్వీకుల్ని ఎంతగా ఫోకస్ చేయాలో అంతగా ఫోకస్ చేయొచ్చు. కానీ.. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో మాట్లాడిన కవిత ఆ పని ఎందుకు చేయలేద‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఎందుకు తలవలేదు? అంటే.. మహిళల కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు లేరనా? తెలంగాణ మహిళా శక్తిని చాటి చెప్పే వారెవరూ లేరా? అనే సందేహాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో భావోద్వేగాల్ని పెంచేసిన వారు.. తమ చేతుల్లోకి అధికారం వచ్చిన వేళ.. గతంలో తాము చెప్పిన మాటల్ని ఎందుకు మర్చిపోతున్నారన్నదే పెద్ద ప్రశ్న. సమకాలీన అంశాలతోనూ.. ఉద్యమంతోనూ సంబంధం లేని వారిని సైతం ఉద్యమ సమయంలో ప్రస్తావించి.. వారిపై వ్యాఖ్యలు చేసినప్పుడు.. వారి మాటల్లో లోగుట్టును వెతికే ప్రయత్నం చేసినప్పుడు.. ఈ రోజు.. ఇప్పటి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న కవిత లాంటి వారు.. తెలంగాణ ప్రముఖల గురించి ఆంధ్రాగడ్డ మీద ఎందుకు మాట్లాడలేదన్నది ప్రశ్న.