అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కుటుంబాలలో టెన్షన్ టెన్షన్

February 10, 2017 at 7:39 am
add_text

త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప‌రిస్థితులు ఏమ‌వుతాయోన‌ని, ఏక్షణంలో ఎలా మార‌తాయోన‌ని అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌క న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య టీవీల‌కు అతుక్కుపోతున్నారు! కానీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. రాజ‌భోగాలు అనుభ‌విస్తూ.. కులాసాగా గ‌డిపేస్తున్నారు. అయితే త‌మ వాళ్లు ఎక్క‌డ ఉన్నారో తెలియ‌క ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌న భార్య‌, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎక్క‌డ ఉన్నారో తెలియ‌డం లేద‌ని ఆమె భర్త పిటిష‌న్ దాఖలు చేయ‌డం ఆశ్చర్యం క‌లిగించ‌క‌మాన‌దు!!

తమిళ‌నాడులో క్యాంపు రాజ‌కీయాల‌కు ఇరు వ‌ర్గాలు తెర తీయ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వానికి రోజురోజుకూ సీనియర్‌ నేతల మద్దతు పెరుగుతుండటంతో అధిష్ఠానం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. పార్టీ శాసన సభ్యులు ప్రత్యర్థి శిబిరానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం మధ్యాహ్నం శశికళ అధ్యక్షత‌న‌ శాసనసభ్యుల సమావేశం ముగియగానే ఎమ్మెల్యేల‌ను లగ్జరీ బస్సులలో గిండీలోని స్టార్‌ హోటళ్లకు తరలించిన విష‌యం తెలిసిందే!

ఎమ్మెల్యేలను చెన్నైకి మరింత దూరంగా మహాబలిపురానికి సమీపంలో ఉన్న రిసార్ట్‌లకు, స్టార్‌ హోటళ్లకు తీసుకెళ్లారు. రాత్రి 11.30 గంటలకు కల్పకం కు చేరువగా ఉన్న బే స్టార్‌ హోటల్‌ రిసార్ట్స్‌కు అవి చేరుకున్నాయి. కాగా ప‌న్నీర్ సెల్వం మ‌ద్దతుదారులుగా ఉన్న 20 మంది శాసనసభ్యులకు గోల్డెన బే రిసార్ట్‌ ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులోని కూవత్తూర్ ప్రాంతంలో బ‌స ఏర్పాటుచేశారు. ఇక్క‌డ కూడా వారికి స‌క‌ల స‌దుపాయాలు క‌ల్పించారు, అయితే ఇరు వ‌ర్గాలు త‌మ మ‌ద్ద‌తుదారుల‌కు సకల సదుపాయాలు ఏర్పాటుచేసినా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వ‌క‌పోవ‌డం వివాదాస్పదంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఒక‌ప‌క్క ఎమ్మెల్యేలు రాజ‌భోగాలు అనుభ‌విస్తుంటే.. క్యాంపులో ఉన్న తమవారి సమాచారం తెలియక పలువురు శాసనసభ్యుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో కృష్ణరాయపురం నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యురాలు గీత భర్త కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన భార్య ఆచూకీ కనుగొని కోర్టులో హాజరు పరచాలని విజ్ఞప్తి చేశారు. మ‌రి ఈ ఉత్కంఠ‌కు ఎప్పుడు తెర‌ప‌డుతుందో!!

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కుటుంబాలలో టెన్షన్ టెన్షన్
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share