కొత్త వాళ్ల‌కు బాబుపై న‌మ్మ‌కం క‌ల‌గ‌ట్లేదా..? అందుకే రివ‌ర్స్ గేర్‌..!

రోజుకు 18 గంట‌లు అలుపెరుగ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. నెల‌కు క‌నీసం రెండు చొప్పున నూత‌న ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. కొత్త‌గా తీసుకొచ్చిన `1100` ప‌థ‌కం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నిక‌లో ఊహించ‌ని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడ‌లో లెక్క‌కు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంత‌గా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుపై  న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదా?  ఆయ‌న‌ను ఎవ‌రూ విశ్వ‌సించ‌డం లేదా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి నంద్యాల ఉప పోరు, కాకినాడ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి చేరిక‌లు భారీ ఎత్తున ఉంటాయ‌ని బాబు భావించారు. 

అంతేకాదు, టీడీపీ నుంచే ఆక‌ర్ష్ మంత్రం ప‌ఠించాల‌ని కొంద‌రు సీనియ‌ర్ల‌కు చెప్పారు కూడా. ఈ క్ర‌మంలోనే కొత్త‌వారు పార్టీలోకి వ‌స్తే.. పాత‌వారు ఎక్క‌డ ఫీల‌వుతారోన‌ని ఏకంగా టీడీపీ వ‌ర్క్ షాప్ పేరుతో మంగ‌ళ‌గిరిలో భారీ ఎత్తున రెండు రోజులు స‌ద‌స్సు ఏర్పాటు చేసి మ‌రీ చంద్ర‌బాబు  పార్టీ బ‌లోపేతం, కొత్త వారి రాక వంటి కీల‌క అంశాల‌పై త‌మ్ముళ్ల‌తో చ‌ర్చించారు. కొత్త‌వారిని తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని, పాత వారు ఫీల‌వ‌రాద‌ని, మీకు కూడా అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని వారిని బుజ్జ‌గించ‌డ‌మే అజెండాగా ఈ వ‌ర్క్ షాపు సాగింది. దీంతో అంద‌రూ ఇక‌, గేట్లు ఎత్తేశారు కాబ‌ట్టి టీడీపీలో వ‌ల‌స‌ల వ‌ర‌ద సాగుతుంద‌ని అనుకున్నారు. 

కానీ, అనూహ్యంగా ఎన్నిక‌లు ముగిసి నెల దాటిపోయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా టీడీపీ గూటికి చేరింది లేదు. అంతేకాదు, పైకి `మాతో ట‌చ్‌`లో ఉన్నార‌ని చెప్పుకొంటున్నా.. ఆ ట‌చ్‌లో ఎవ‌రున్నారో?  వారి పేర్లోంటో కూడా నేత‌లు చెప్ప‌లేక‌పోతున్నారు. ఇక‌, “ట‌చ్‌“లో ఉంటే ఇన్నాళ్లా?  అనే సందేహం కూడా వ‌స్తోంది. దీంతో వైసీపీ స‌హా ఇత‌ర పార్టీల నుంచి నేత‌లు టీడీపీలో చేర‌నున్నార‌నే కామెంట్ల‌తో వాస్త‌వం  లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, మైదుకూరు నుంచి మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి రేపో మాపో బాబు పంచ‌న చేర‌నున్నార‌నే వార్త ఒక్క‌టే ఉప‌శ‌మ‌నం.

ఇదిలావుంటే, వైసీపీలోకి ఇత‌ర ప్రాంతాల నుంచి నేత‌ల చేరిక పెరిగింది. ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి ప్రాంతాల నుంచి నేత‌లు రెండు రోజుల కింద‌టే జ‌గ‌న్ స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకొన్నారు. మ‌రోప‌క్క టీడీపీ నుంచి మాజీ ఎంపీ చిమటా సాంబు వెళ్లిపోయారు. దీంతో ఆయ‌న వెళ్ల‌డానికి గ‌ల కారణాలను  చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంకా అధికార పార్టీలో చేరికలు లేకుంటే బూస్ట్ రాదని బాబు తెగ మ‌థ‌న ప‌డుతున్నారు. అయినా కూడా ఎందుకో అనుకున్న విధంగా ప‌రిస్థితి  మార‌క పోవ‌డంతో బాబు ఏం చేయాలో అర్థం కాక త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్టు స‌మాచారం.