ఏపీ బీజేపీలో పోటీకి సీనియ‌ర్లు కూడా నై

July 10, 2018 at 10:10 am
AP-BJP-

ఏపీలో బీజేపీ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏమిటో ఇప్ప‌టికే నేతలకు స్ప‌ష్ట‌మైన క్లారిటీ వ‌చ్చేసింది. కొత్తగా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. అవ‌న్నీ నిరుప‌యోగ‌మ‌నే విష‌యం తేలిపోతోంది. కాంగ్రెస్ విభ‌జించి అన్యాయం చేస్తే.. బీజేపీ మాత్రం న‌మ్మించి మోసం చేసింద‌నే అభిప్రాయంతో పాటు ఆగ్ర‌హం ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీకి ఇప్ప‌టికే కొంత‌మంది గుడ్‌బై చెప్పేందుకు రెడీగా ఉన్నారు. మ‌రి ఉన్న వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేస్తారా? అంటే అది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. ఒకవేళ  పార్టీ అధిష్ఠానం ఒత్తిడితో పోటీకి దిగినా భంగ‌పాటు త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న వీరిలో రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. దీంతో కొంత మంది సీనియ‌ర్లు కూడా పోటీ అంటేనే భ‌య‌ప‌డుతున్నార‌ట‌. మ‌రోప‌క్క పార్టీలో కుమ్ములాట‌లు రోజురోజుకూ ఎక్కువ‌వుతుండ‌టంతో ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా మారింది.

 

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున ఎవ‌రెవ‌రు పోటీచేస్తారు?  అంటే ప‌ట్టుమ‌ని ప‌దిమంది పేర్లు కూడా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మోదీ హ‌వాతో టీడీపీ అండ‌తో పోటీచేసినా.. అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే ఆద‌ర‌ణ ల‌భించింది. ఇదే స‌మ‌యంలో పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా అవ‌న్నీ స‌త్ఫలితాల‌ను ఇవ్వ‌లేక పోయాయి. ఇక టీడీపీతో క‌టీఫ్ త‌ర్వాత క‌మ‌ల‌నాథుల‌కు ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే వ‌స్తున్నాయి. ఆ పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే ఇప్పుడు పార్టీలో సీనియ‌ర్ల‌కు సంక‌టంగా మారింది. అటు పార్టీలో ఉండ‌లేక‌.. ఇటు ఇత‌ర పార్టీల్లో చేర‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్లు కొంద‌రి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ‌ట‌. అధిష్టానం త‌మ‌ను పోటీచేయాల‌ని ఆదేశిస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నార‌ట‌. 

 

గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న పురందేశ్వ‌రి, కావూరి సాంబ‌శివ‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వంటి వారంతా టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో గ‌ల‌ వైరంతో.. బీజేపీలో చేరిపోయారు. మిత్ర‌త్వం కొన‌సాగిన సంద‌ర్భంలోనే అడ‌పా ద‌డ‌పా బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించేవారు. అయితే ప్ర‌స్తుతం టీడీపీతో క‌టీఫ్‌, విభ‌జ‌న హామీలు అమ‌లుచేయ‌లేద‌ని చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారం, ఇత‌ర అంశాల‌తో క‌మ‌ల‌నాథులకు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. దీంతో సీనియ‌ర్ల‌లో గుబులు మొద‌లైంద‌ట‌. ప్ర‌స్తుతం కృష్ణంరాజు, కావూరి సాంబ‌శివ‌రావు, పురందేశ్వ‌రి, ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్యాల‌రావు, కంబంపాటి హ‌రిబాబు వంటి వారు పార్టీ కార్య‌క్ర‌మాల్లో అతి త‌క్కువ‌గా పాల్గొంటున్న విష‌యాన్ని అంతా గుర్తుచేస్తు న్నారు. ఒక‌వేళ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగినా ప్ర‌యోజ‌నం శూన్య‌మ‌ని క్యాడ‌ర్ ఆందోళ‌న చెందుతోంద‌ట‌. 

 

మరో పదినెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగా.. రాష్ట్ర బీజేపీలో గ్రూపులు పెరుగుతున్నాయి. కంభంపాటి హరిబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుగ్రూపులుగా ఉన్న బీజేపీ.. పైకి మాత్రం ఒక్కటిగా కనిపించేది. ఇప్పుడు ఏకంగా ఆఫీసులో పీఆర్‌వో నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకూ గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కూడా కొర‌వ‌డ‌టం కూడా పార్టీని దెబ్బ‌తీస్తోంది. విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీ‌నివాస్ రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తున్నార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ త‌రుణంలో క‌మ‌లం ప‌రిస్థితి ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!

ఏపీ బీజేపీలో పోటీకి సీనియ‌ర్లు కూడా నై
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share