ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి

కేంద్రంలోను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి. మోడీ వేవ్ బాగుండ‌డంతో మోడీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ స్పీడ్ చూస్తుంటే ఇప్పుడైనా ఎన్నిక‌ల‌కు వెళ్లిపోవాల‌న్నంత ఉత్సాహంతో కేసీఆర్ ఉన్నారు. ఏపీలో మాత్రం నంద్యాల ఫ‌లితం ముందు వ‌ర‌కు ముంద‌స్తుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డ సీఎం చంద్ర‌బాబు నంద్యాల‌లో టీడీపీ భారీ మెజార్టీతో గెల‌వ‌డంతో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను వార్ టీడీపీకి అనుకూలంగా వ‌న్‌సైడ్ అయిపోవ‌డంతో ఆయ‌న‌లో కూడా ఫుల్ జోష్ వ‌చ్చేసింది.

ఇక ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ముంద‌స్తుకు సై అంటే సై అంటున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉంద‌ని నిన్న‌టి వ‌ర‌కు విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆరోపించాయి. అయితే ఇప్పుడు నంద్యాల‌లో టీడీపీ భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌డంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు పెద్ద‌గా స్కోప్ లేద‌న్న నిర్ణ‌యానికి చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నాయ‌కులు వ‌చ్చారు. దీంతో వాళ్లు కూడా పార్టీకి ఇప్పుడు ఉన్న వేవ్‌ను వాడుకుని ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు.

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల విషయాన్ని బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న వ్య‌క్తే నిర్దారించ‌డంతో ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై అంద‌రికి క్లారిటీ వ‌చ్చిన‌ట్ల‌య్యింది. బాబు కేబినెట్‌లో బీజేపీ నుంచి మంత్రిగా ఉన్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావు ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్పుడు ఈ ప్ర‌క‌ట‌న పెద్ద సంచ‌ల‌నంగా మారింది. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తాము గ‌డువుకు ఎనిమిది నెల‌ల ముందే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళుతున్నామ‌ని చెప్పారు.

తాము గ‌డువుకు ఎనిమిది నెల‌ల ముందే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్నామ‌ని, త‌మ‌తో పాటు మండలస్థాయి నాయకులు కూడా పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇక కేబినెట్‌లో మంత్రిగా ఉన్న మాణిక్యం ఈ విష‌యం బ‌హిర్గ‌తం చేయ‌డంతో ప్ర‌స్తుతం వ‌స్తోన్న ముంద‌స్తు ఎన్నిక‌ల వార్త‌ల‌కు ఆయ‌న ఊతం ఇచ్చిన‌ట్లు అయ్యింది. ఆయ‌న చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తే 2018 అక్టోబ‌ర్‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది. దీంతో ఏపీ రాజ‌కీయం అప్పుడే హీటెక్కేయ‌డం ఖాయ‌మైపోయింది.