ఏపీ మునిసిప‌ల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు

ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డుల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ స‌త్తా చాటింది. టీడీపీ జోరుకు విప‌క్ష వైసీపీ బేజార‌య్యింది. కీల‌క జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ‌ప‌ట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో ప‌లు వార్డుల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ్డాయి. ఒక్క వార్డులో మిన‌హా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది.

రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు జిల్లాలో మాచ‌ర్ల 15వ వార్డులో టీడీపీ, 16 వార్డులో ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలుపొందారు. అదే జిల్లాలో రాజ‌ధానికి కూత‌వేటు దూరంలో ఉన్న మంగ‌ళ‌గిరి మునిసిపాలిటీలో మాత్రం 30 వార్డులో వైసీపీ విజ‌యం సాధించింది. ఇక్క‌డ టీడీపీ అభ్యర్థిపై 153 ఓట్లతో వైసీపీ అభ్యర్థి రమణ విజయం సాధించారు. కీల‌క‌మైన రాజ‌ధాని ప్రాంతంలో అది కూడా టీడీపీ చేతుల్లో ఉన్న మునిసిపాలిటీలో ఆ పార్టీ అభ్య‌ర్థి ఓడిపోవ‌డం టీడీపీకి కాస్త ఇబ్బందే.

ఇక హోరాహోరీగా జ‌రిగిన క‌ృష్ణా జిల్లా గుడివాడ 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి 149 ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు. ఇక్క‌డ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఇది పెద్ద ఎదురు దెబ్బ‌. ఇక చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పలమనేరు 23వ వార్డులో టీడీపీ అభ్యర్థి మదన్‌మోహన్‌ 371 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం పార్టీ ఫిరాయించి మంత్రి అయిన అమ‌ర్‌నాథ్‌రెడ్డిది.

ఇక జిల్లా కేంద్ర‌మైన చిత్తూరు కార్పొరేషన్‌ 38వ డివిజన్‌ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి వసంతకుమార్‌ 1609 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాల‌య్య ఇలాకా హిందూపురంలోని 9వ వార్డులో టీడీపీ అభ్య‌ర్థి బోయ శాంత ఏకంగా 939 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే జిల్లాలోని తాడిప‌త్రి 4వ వార్డులోను టీడీపీనే గెలిచింది.

ఇక కర్నూలు జిల్లా ఆత్మకూరు రెండోవార్డులో టీడీపీ అభ్యర్థి 399 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం మునిసిపాలిటీలో మూడు వార్డుల్లోను టీడీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. ఇక విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలీటీ 16వ వార్డులో టీడీపీ విన్ అయ్యింది. ఒక్క మంగ‌ళ‌గిరి…అది రాజ‌ధాని స‌మీపంలో వార్డు గెలిచామ‌న్న సంత‌ప్తి మిన‌హా వైసీపీకి ఈ ఉప పుర పోరులో ఘోర అవ‌మాన‌మే మిగిలింది.