ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ క‌థ‌.. రాష్ట్రానిది మ‌రో స్టోరీ!!

విభ‌జ‌న అనంత‌రం ఏర్ప‌డ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉంద‌ని, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం దీనిని కేంద్ర‌మే పూడ్చాల‌ని ప‌దే ప‌దే లెక్క‌లు చెప్తూ వ‌స్తోంది రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామ‌ని కొద్దో గొప్పో మాత్ర‌మే బ‌కాయి ఉంద‌ని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవ‌రి మాట న‌మ్మాలో ప్ర‌జ‌లకు అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయ‌డం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుద‌ల చేయాల్సింది మ‌రో రూ. 138 కోట్లు మాత్ర‌మే అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టం చేశారు! అంటే, ఇప్ప‌టికే చాలా లోటు భ‌ర్తీ చేసిన‌ట్టు.. ఇది కూడా ఇచ్చేస్తే ఇవ్వాల్సింది ఇచ్చేసిన‌ట్టే అని చెప్ప‌క‌నే చెబుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అంటే.. కేంద్రం చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం ఆంధ్రా రెవెన్యూ లోటు రూ. 4117 కోట్లు. దీన్లో ఇప్ప‌టికే కేంద్రం ఏపీకి అందించిన సాయం రూ. 3979 కోట్లుగా ఆర్థిక‌మంత్రి చెబుతున్నారు. ఇక, మిగిలింది 138 కోట్లు మాత్ర‌మేన‌నీ, దాన్ని కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తున్నామ‌ని, ఏపీ స‌ర్కారుకు ఇదే మాట చెప్పార‌ని తెలుస్తోంది. అయితే, దీంతో ఇన్నాళ్లూ ఏపీ రెవెన్యూలోటు గురించి చంద్ర‌బాబు స‌ర్కారు చెబుతున్న‌ది నిజ‌మా కాదా అనే అనుమానం క‌లుగుతోంది. ఎందుకంటే, చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ద‌హారు వేల కోట్ల లోటు ఉంద‌ని చెబుతుంటారు. కానీ, కేంద్రం లెక్క‌ల ప్ర‌కారం ఆ లోటు నాలుగు వేల కోట్ల పైచిలుకే!

ఈ త‌రుణంలో ఎవ‌రి ప్ర‌క‌ట‌న‌లు న‌మ్మాలి..? ఇంత‌కీ ఏపీకి ఉన్న రెవెన్యూ లోటు ఎంత‌..? కేంద్రం చెబుతున్న‌ట్టు రూ. 4 వేల కోట్లా… చంద్ర‌బాబు చెబుతూ ఉన్న‌ట్టుగా రూ. 16 వేల కోట్లా..? ఇన్నాళ్లూ చంద్ర‌బాబు చెప్పిన‌వి కాకి లెక్క‌లా..? ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తే కేంద్రంపై టీడీపీ అసంతృప్తి ఎందుకు..? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో భాజ‌పాని విస్త‌రించే ప‌నుల‌ను మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రాకి కేంద్రం చేసిన సాయాన్నే భాజ‌పా ప్ర‌ముఖంగా ప్ర‌చారం చేసుకుంటుంది. సో… ఆంధ్రా రెవెన్యూ లోటు మొత్తాన్ని భ‌ర్తీ చేసేశామని కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా బాబు అస‌లు నిజాలు వెల్ల‌డిస్తే… మంచిది!!