ఏపీలో మ‌రో స్విస్ ఛాలెంజ్‌… న‌యా దోపిడీ చూస్తే షాకే..!

స్విస్ ఛాలెంజ్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. ఏపీ రాజ‌ధాని నిర్మాణాల‌కు సంబంధించి కొన్ని నెల‌ల కింద‌ట పెద్ద దుమారం రేపిన సంస్థ ఇది. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ అంటూ హ‌డావుడి చేసిన ఈ సంస్థ‌కు కాంట్రాక్టులు అప్ప‌గించాల‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ‌లు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, ఈ కాంట్రాక్టు సంస్థ పెట్టిన ష‌ర‌తులు, నిబంధ‌న‌లు ఏపీ రాష్ట్రం మెడ‌కు ఉచ్చుగా త‌గులుకుంటాయ‌ని తెలియడం ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా కూడా సీఎం వెన‌క్కి త‌గ్గ‌లేదు. కానీ, అధికారులు సైతం దీనిపై విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు స్విస్ ఛాలెంజ్‌ను ప‌క్క‌న పెట్టారు.

అయితే, ఇప్ప‌డు ఇలాంటి మ‌రో స్విస్ సంస్థ తెర‌మీద‌కి వ‌చ్చింది. అయితే, ఇది రాజ‌ధాని నిర్మాణాల‌కు సంబంధించింది కాక‌పోయినా, విద్యార్థ‌లు జీవితాల‌కు సంబంధించింది! శాప్ శిక్ష‌ణ పేరిట వెలుగులోకి వ‌చ్చిన ఈ సంస్థ వివ‌రాలు చూద్దామా? ఏపీలో వివిధ ఫ్రొఫెషనల్ కాలేజీల్లో చదివే ఇంజనీరింగ్ థర్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు..సెకండ్ ఇయర్ ఎంబీఏ స్టూడెంట్స్ కు శాప్ ట్రైనింగ్ ఇవ్వాలని యాష్ టెక్నాలజీస్ అనే సంస్థ భావించింది. దీంతో వెంట‌నే ప్ర‌భుత్వానికి ఓ ప్ర‌తిపాద‌న పంపింది. అది కూడా స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తి కింద‌! దీనిపై ఎంత‌మాత్ర‌మూ త‌డుముకోకుండానే ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఓకే చెప్పేందుకు డిసైడ్ అయింది.

అయితే, న్యాయ ప‌రంగా ఏమ‌న్నా ఇబ్బందులు వ‌స్తాయేన‌ని భావించి.. ఆ కంపెనీలాగా చేయగలిగే సంస్థలు ఏవైనా ఉంటే ముందుకు రావాలని ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఇక్క‌డే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నామ‌మాత్రంగానే ఈ నోటిఫికేష‌న్ విడుద‌లైంద‌ని, యాష్ టెక్నాల‌జీ సంస్థ‌కే అనుమ‌తులు ఇవ్వాల‌ని `పైస్థాయి`లో నిర్ణ‌యాలు జ‌రిగిపోయాయ‌ని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. `పైస్థాయిలో` అంతా చ‌క్క‌దిద్దుకున్నాకే ఈ సంస్థ నుంచి ప్ర‌తిపాద‌న‌ను స్వీక‌రించార‌ని అంటున్నారు. అదేస‌య‌మంలో అసలు ఎవరికి శిక్షణ ఇవ్వాలి..? ఏ ఇయర్ నుంచి అనేది కూడా ఓ ప్రైవేట్ సంస్థ ఎలా నిర్ణయిస్తుందని? ప్రశ్నిస్తున్నారు.

యాష్ టెక్నాలజీస్ సంస్థ గతంలో అధికార పార్టీకి స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో అనధికారికంగా సేవలు అందించినట్లు స‌మాచారం. దీంతో ఈ సంస్థ‌కు ఏదో విధంగా ల‌బ్ధి చేకూర్చేలా అప్ప‌ట్లో ఒప్పందాలు కుదిరాయ‌ని అంటున్నారు. దీనిలో భాగంగానే శాప్ పేరుతో ఓ ప్ర‌తిపాద‌న రాగానే వెనుకా ముందు ఆలోచించ‌కుండా ఓకే చెప్ప‌డం, సంస్థకు కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకు రెడీ అవ‌డం వంటివి జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. మొత్తానికి ఏపీలో మ‌రో స్విస్ త‌ర‌హా ఉదంతం వెలుగు చూడ‌డంపై విమర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ప్ర‌భుత్వం స్పందిస్తుందా? లేదా? చూడాలి.