క్రైసిస్‌లో టీడీపీ.. కార‌ణాలు ఇవేనా..? 

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుల‌ స‌మీక‌ర‌ణాలు త‌ప్పాయి! ప్రాంతాల వారీగా స‌మ‌న్యాయం పాటించామ‌ని చెబుతున్న ఆయ‌న‌ లెక్క‌లు ఎక్క‌డో బెడిసికొట్టాయి! మంత్రి వ‌ర్గ‌విస్త‌ర‌ణ‌లో నూటికి నూరు శాతం అన్ని వర్గాల‌కు న్యాయం చేశామ‌ని, లెక్క‌ల‌న్నీ పాటించాన‌ని ఆయన బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నా.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయ‌న‌కు మార్కులు వేసేందుకు వెనుకాడుతున్నాయి. మొత్తానికి ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణతో రేగిన అల‌జ‌డి నివురుగప్పిన నిప్పులా ఇంకా కొనసాగుతోంది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న‌త‌రుణంలో పార్టీలో ఈ సంక్షోభం.. ప్ర‌తిప‌క్షాల‌కు ల‌బ్ధి చేకూరేలా చేస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో వ్యూహాత్మకంగా సామాజిక లెక్కలతో చేశారన్న మంత్రివర్గ విస్తరణ ఎన్నడూ లేని స్థాయిలో అసంతృప్తిని పెంచాయి. టీ కప్పులో తుపానులా చల్లారిపోయిందని పాలకవ‌ర్గ నేత‌లే కొంత‌మంది అభిప్రాయ‌ప‌డ్డారు. మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన టీడీపీ నేత‌లు అల‌క‌పాన్పు వీడ‌టం లేదు. బుజ్జ‌గింపులు, హామీలు అన్నీ చేసినా.. ఇంకా వారిలో ఏమూల‌నో అసంతృప్తి గూడు క‌ట్టుకుపోయింది. ఒక్క‌టి కాదు రెండు కాదు అన్ని జిల్లాల్లోనూ ఇదే త‌ర‌హా ఆగ్ర‌హ జ్వాల‌లు ర‌గులుతూనే ఉన్నాయి.

తెలుగుదేశం అంతర్గత పరిస్థితి నివురు కప్పిన నిప్పులానే వుందని తేలిపోయింది. కడపలో అదినారాయణ రెడ్డి వర్సెస్‌ రామసుబ్బారెడ్డి వివాదం; కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా వర్సెస్‌ శిల్పా తగాదా,దీనికితోడు శిల్పా సోద‌రుల మ‌ధ్య సంవాదం; తిరుపతిలో ఎంపి శివప్రసాద్‌ బహిరంగ విమర్శలు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అసంతృప్తి; తూర్పు గోదావరిలో గోరంట్ల బుచ్చయ్య తిరుగుబాటు; పయ్యావుల కేశవ్‌, ధూలిపాళ్ల నరేంద్ర వంటి వారి నిర్వేదం; విజయవాడలో కేశినేని నాని, బోండా ఉమామహేశ్వరరావు వంటివారి చుట్టూ ఏదో రూపంలోసాగుతున్న సమస్యలు అన్నీ కలిపి అధిష్టానాన్ని అశాంతికి గురిచేస్తున్నాయి.

ఒకరిని పిలిచి మందలిస్తే మరొకరు మంట పెడుతున్నారు. అందరికీ మాటలు చెప్పి బుజ్జగించినా లోలోపల మిగిలిన అసంతృప్తి ఇప్పుడు భగ్గుమంటోంది. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌తిప‌క్ష వైసీపీ వేచిచూస్తోంది. వీట‌న్నింటికీ కార‌ణం.. విస్త‌ర‌ణ, చంద్ర‌బాబు అని పార్టీలో కొంద‌రు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రి పార్టీలో నెల‌కొన్న ఈ అంత‌ర్గ‌త సంక్షోభాన్ని.. అధినేత చంద్ర‌బాబు.. ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే!!