అవ‌మానాలు ఎదుర్కోలేక పార్టీ వీడనున్న కవిత!

ఈ హెడ్డింగ్ చూసిన వారు బీజేపీలోకి క‌విత ఏంటి ? అని కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉంటారు. క‌విత అంటే కేసీఆర్ కుమార్తె క‌విత కాదు…నిన్నటి త‌రం ప్ర‌ముఖ హీరోయిన్‌, ప్ర‌స్తుత టీడీపీ నాయ‌కురాలు అయిన క‌విత‌. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప‌దేళ్ల‌పాటు ఆమె పార్టీ త‌ర‌పున వాయిస్ గ‌ట్టిగా వినిపించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీలోనే ఉన్న అతికొద్దిమందిలో క‌విత ఒక‌రు. టీడీపీ ఆందోళ‌న‌ల‌ను ఆమె ప్ర‌జ‌ల్లోకి బాగానే తీసుకెళ్లేవారు.

పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ క‌విత‌కు మంచి గౌర‌వం ఇచ్చేది. ఎప్పుడైతే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యారో అప్ప‌టి నుంచి క‌విత కాదు క‌దా..క‌నీసం ఆమె మాట కూడా ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. దీంతో ఆమె త‌న అసంతృప్తిని ఇప్ప‌టికే ఒక‌టి రెండుసార్లు బ‌హిరంగంగానే వినిపించారు. రెండేళ్ల క్రితం హైద‌రాబాద్ మ‌హానాడులో ఆమెను వేదిక‌మీద‌కు పిల‌వ‌లేదు.

ఇక తాజాగా విశాఖ‌లో జ‌రుగుతోన్న మ‌హానాడులో సైతం ఆమెను నిర్వాహ‌కులు వేదిక మీద‌కు రానివ్వ‌లేదు. ఈ అవ‌మానాన్ని మీడియా ముందే చెప్పుకుని భోరున ఏడ్చేసిన ఆమె వెంట‌నే హైద‌రాబాద్‌కు వెళ్లిపోయారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం క‌విత టీడీపీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యార‌ట‌. టీడీపీలో అవ‌మానాలు ఎదుర్కోవ‌డం కంటే బీజేపీలో చేర‌డ‌మే మంచిద‌న్న నిర్ణ‌యానికి ఆమె వ‌చ్చేసిన‌ట్టు టాక్‌.

ఇక చంద్ర‌బాబు అంటే యాంటీగా ఉండే బీజేపీలోని ఓ వ‌ర్గంతో క‌విత చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి ఆమెకు సౌత్ ఇండియాలోని అన్ని భాష‌ల్లోను మంచి ప‌ట్టు ఉంది. ఆమెను బీజేపీలో చేరి…సౌత్ ఇండియాలో పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేయాల‌ని ఆ పార్టీ నుంచి ఎప్పుడో ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే ఆమె మాత్రం తాను టీడీపీలోనే కంటిన్యూ అవుతాన‌ని ప‌ట్టుబ‌ట్టారు. తీరా ఇప్పుడు పార్టీలో వ‌రుస అవ‌మానాల‌తో ఆమె సైకిల్ దిగి..కాషాయం గూటికి చేరేందుకే ఆస‌క్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.