మంత్రిగారికి వ‌రుస అవ‌మానాలు… ఏం జ‌రుగుతోంది.

వ‌రుస ప‌రిణామాలు ఆయ‌న్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఏం జ‌రుగుతోందో తెలుసుకునేలోగానే.. మ‌రో అంశంలో ఎదురు దెబ్బ‌లు ఆయ‌నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్టీకి అండ‌గా ఉంటూ.. జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన ఆయ‌న ప్రాభ‌వం క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నేందుకు ర‌క‌ర‌కాల ప‌రిణామాలు ఉదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తున్నాయి. సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితుడిగా పేరు ఉన్నా.. జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న మాట నెగ్గ‌డం లేదు., స‌రిక‌దా వ‌రుస‌గా అవ‌మానాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. పార్టీ క్యాడ‌ర్ వ‌ద్ద కూడా ప‌ట్టిం చుకోవ‌డం లేద‌ట‌. ఆయ‌న మ‌రెవ‌రో కాదు కేంద్ర‌మంత్రి పూస‌పాటి అశోక‌గ‌జ‌ప‌తి రాజు!!

టీడీపీలో ఉన్న అత్యంత సీనియ‌ర్ల‌లో అశోక‌గ‌జ‌ప‌తి రాజు కూడా ఒక‌రు. ఎన్నో ద‌శాబ్దాలుగా పార్టీకి సేవ‌లందిస్తూ వ‌స్తున్నారు. సీఎం చంద్ర‌బాబుకు కూడా ఎంతో ఆప్తుడు. జిల్లా రాజకీయాల‌ను కూడా చెప్పుచేతల్లో పెట్టుకున్న సంద‌ర్భాలు అనేకం. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు త‌ల్ల‌కిందుల‌య్యాయి. జిల్లా రాజకీయాల్లో క్ర‌మ‌క్ర‌మంగా ఆయ‌న ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌స్తోంది. కొత్త‌గా పార్టీలోకి చేరిన వారు సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆయ‌న‌కు, సీఎంకు మ‌ధ్య గ్యాప్ ఎక్కువైంద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇక జిల్లా రాజ‌కీయాల‌పై ఆయ‌న ప‌ట్టు కోల్పోతున్నారనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి రాజకీయ వారసత్వంపై ప్ర‌స్తుతం జిల్లాలో చ‌ర్చ జ‌రుగు తోంది. ఆమె ఎంట్రీ ఇస్తే విజయనగరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.

గీత వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ప్రసాదుల రామ కృష్ణ కూడా ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించ‌డంతో మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టి బుజ్జగించారు. అలాగే జిల్లా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నర్శింగరావుకు కూడా ఇదే నియోజకవర్గం నుంచి సీటు ఆశించారు. వచ్చే ఎన్నికల్లో గీతకు వీరిద్దరి నుంచి మళ్లీ తలనొప్పి వచ్చే అవకాశం లేక‌పోలేదు.

ఇక జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా గంటా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించిన నాటి నుంచి జిల్లా టీడీపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో అశోక్‌ గజపతిరాజుకు గంటా శ్రీనివాస రావుకు మధ్య ఆధిపత్య పోరులో గంటాదే పైచేయి అయ్యింది. అధిష్టానం కూడా గంటా మాటకే విలువనిచ్చి ఆయన సూచించిన మహంతి చిన్నంనాయుడిని నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మీసాల గీత, కె.ఎ.నాయుడు వంటి కొందరు ఎమ్మెల్యేలు కూడా గంటాకు అనుకూలంగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అశోక్‌తో విభేదాలు ఉన్న‌ సుజ‌య కృష్ణారంగారావును మంత్రిగా ఎంపిక‌చేయ‌డం బాబు ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే!