అశోక్ మాటను కొట్టిపడేసిన బాబు

కేంద్ర‌మంత్రిగా, టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా, ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌మైన ప‌ట్టున్న నేత‌గా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు ప్రాభ‌వం పార్టీలో క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోందా? అధిష్టానం వ‌ద్ద ఆయ‌న మాట చెల్ల‌ని కాసుగా మారిపోయిందా? సీఎం చంద్ర‌బాబు కూడా ఆయ‌న మాట‌ను పట్టించుకోవ‌డంలేదా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. కేంద్ర‌మంత్రిగా ఉన్నా త‌న వ‌ర్గానికి చెందిన‌, త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన వ్య‌క్తిని జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మించుకోలేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో అధిష్టానం వద్ద అశోక్‌ ప్రాభవం తగ్గిందని, జిల్లా తెలుగు దేశం పార్టీలో ఇక పెద్ద మార్పులే చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు మాటకు అధిష్టానం ఎదురుచెప్పే ప్ర‌య‌త్నం చేయ‌రు. ఇదీ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ పార్టీలో అభిప్రాయం! కానీ ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితులు అన్నీ త‌ల్ల‌కిందుల‌య్యాయి. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సుజ‌య కృష్ణ రంగారావు టీడీపీలో చేరిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు ఎదురుగాలి వీస్తోంద‌నే ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. కొన్నేళ్లుగా పార్టీ పదవులకు సంబంధించి అశోక్‌ గజపతిరాజు మాటకు అధిష్టానం ఎదురుచెప్పలేదు. అలా అని ఆయన అన్ని విషయాల్లోనూ కలుగజేసుకోలేదన్నది కూడా నిర్వివాదాంశం. అయితే ఇప్పుడు రెండో అధికార కేంద్రాన్ని అధిష్టానం ఏర్పాటు చేసిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడిగా ఆయ‌న త‌న అనుంగు శిష్యుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను ప్రతిపాదించారనేది ఎవరూ కాదనలేని సత్యం. ఆదివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో మహంతి చిన్నంనాయుడిని పేరును విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడిగా ఖ‌రారుచేయ‌డంతో అశోక్ వ‌ర్గానికి షాక్ త‌గిలిన‌ట్ట‌యింది. దీంతో జిల్లా టీడీపీ నేత‌లు కూడా అవాక్క‌వుతున్నారు. మొదటి నుంచీ మాజీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌నే మళ్లీ ఎన్నుకుందామని అశోక్ చెబుతూ వ‌చ్చారు. జిల్లా ఇన్‌చార్జిగా గంటా శ్రీనివాసరావు వచ్చి వెళ్లిన తరువాత ప‌రిస్థితి మారిపోయిందని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, అతని సోదరుడు కొండలరావు, పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడుల పేర్లు ఐవీఆర్‌ఎస్‌లో వచ్చాయి. చాలా మంది అశోక్‌ చెప్పిన వారికే పదవి వస్తుందని ప్రచారం చేశారు. కానీ, కె.ఎ.నాయుడు, కొండలరావుల పేర్లు దాదాపు ఖరారయినట్టేనని జిల్లాలో ఊహాగానాలు అందుకున్నాయి. జిల్లాలో అంతో ఇంతో పేరున్న వీరందరి పేర్లూ తెరమీదికి వచ్చినా మండల స్థాయి నాయకుడిగా చిరకాలం అక్కడే ఉండిపోయిన మహంతి చిన్నం నాయుడిని ఎంపిక చేయ‌డం.. అందులోనూ అశోక్ సూచించిన వ్య‌క్తికి ద‌క్క‌క‌పోవ‌డం తో ఇక అధిష్టానం, చంద్ర‌బాబు వ‌ద్ద ఆయ‌న ఇమేజ్ త‌గ్గుతోంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది!