రాహుల్ మెలిక‌తో బాబు షాక్‌

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో ఇప్ప‌టికే కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్ర‌బాబుకు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇవ్వ‌బోతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మీదే టీడీపీ అధినేత ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు స‌రిగ్గా వీటిని చెద‌ర‌గొట్టే మాస్ట‌ర్ ప్లాన్‌తో రాహుల్ సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అంతోఇంతో మ‌ళ్లీ బ‌ల‌ప‌డాల‌ని కాంగ్రెస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై స‌రికొత్త మెలిక పెట్టింది. దీంతో చంద్ర‌బాబు పూర్తి డిఫెన్స్‌లో ప‌డిపోక త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భలో ప్ర‌క‌టించారు. అయితే ఐదేళ్లు స‌రిపోద‌ని క‌నీసం ప‌దేళ్లు అయినా కావాల‌ని అప్ప‌డు ప్ర‌తిప‌క్షంలో ఉన్న అరుణ్‌జైట్లీ, వెంక‌య్య నాయుడు ప‌ట్టు బ‌ట్టారు. ఏపీని విభ‌జించిన కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు చావుదెబ్బ కొట్టారు. ఆనాడు ప‌దేళ్లు హోదా కావాల‌ని కోరిన నేతలు ఇప్పుడు మాట త‌ప్పారు. హోదా వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని, ప్యాకేజీతోనే ఎన్నో లాభాలు ఉన్నాయంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. అయితే ఇన్నాళ్లూ ఎప్పుడు అవ‌కాశం దొరుకుతుందా, టీడీపీ-బీజేపీని ఇరుకున పెడదామ‌ని ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు ఆ అవ‌కాశం ద‌క్కింది.

ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం రాజ‌కీయంగా టీడీపీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మస్య‌గా మారింది. 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల ఒత్తిడిని త‌ట్టుకోవాలంటే ఇది త‌ప్ప‌నిస‌రి. అందుకే దీనిపైనే కాంగ్రెస్ దృష్టిసారించింది. విభజన సందర్బంగా ఏపీకి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా…రైల్వే జోన్ వంటి కీలక హామీలను నెరవేరిస్తేనే తాము బిల్లులో పెట్టిన నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు మద్దతు తెలుపుతామని మెలిక పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు బిల్లు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాతో పాటు…ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత వంటి అంశాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా మౌనంగానే భరిస్తున్నారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ ఇవ్వనున్న మాస్టర్ స్ట్రోక్ తో చంద్రబాబు కు క‌చ్చితంగా షాక్ తగలినట్లే అవుతుంది. అంతే కాదు.. ఇటీవల టీడీపీపీ సమావేశం పెట్టి చంద్రబాబు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని సూచించారు. రాహుల్ గాంధీ తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు నకు బ్రేకులు పడటం ఖాయం. ఎందుకంటే హోదా ముగిసిన అధ్యాయం అని చెబుతోంది. ఇక రైల్వేజోన్‌ను ఇత‌ర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేద‌ని మెలిక పెడుతున్నాయి, ఇప్పుడు ఈ అంశాన్ని ఎన్నుకోవ‌డం ద్వారా కాంగ్రెస్ కూడా కొంత బ‌లం పుంజుకునే అవ‌కాశాలు లేక‌పోతేదు. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు పూర్తిగా డిఫెన్స్‌లో ప‌డిపోయిన‌ట్టే!!