2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బాబు ముందస్తు వ్యూహం!

ఏపీలో రాజ‌కీయాలు రోజుకో విధంగా మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ ఇప్పుడు మోడీ ప‌క్షం అయిపోయాడు.  త‌మ‌కు ఏదో ఒక ఆ ధారం దొర‌క్క‌పోతుందా అని ఎదురు చూసే వామ‌ప‌క్షాలు ఇప్పుడు కొత్త‌గా జ‌నంలోకి వ‌చ్చిన జ‌న‌సేన‌కి జై కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి ఇదే విష‌య‌మై చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే త‌న పార్టీ త‌మ్ముళ్ల‌కు గీతోప‌దేశం చేశార‌ట‌.

వచ్చే ఎన్నికల నాటికి పొత్తు విషయంలో టీడీపీ ఆసక్తిగానే ఉన్నా బీజైపీ వైఖరి  మాత్రం ఒంటరిగా అయినా పోటీకి దిగేలా ఉంది.  లేకుంటే వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక‌, టీడీపీ మ‌ద్ద‌తు దారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేస్తున్న రాజకీయ అడుగులను బట్టి ఆయన బీజేపీకి పూర్తిగా దూరమైనట్లు కనిపిస్తున్నాడు.

భవిష్యత్తులో టీడీపీ తో కూడా సంబంధాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రస్తుతం ఆయన వామ పక్షాలకు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తుల అంశం ఇప్పటికైతే స్పష్టత రాలేదు. పరిస్థితులు వికటిస్తే తప్ప బలవంతంగా పవన్ ని దూరం చేసుకోకూడదనేది చంద్రబాబు ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ దూరం జరిగితే టీడీపీకి కొంత నష్టం జరగొచ్చు. కానీ అది టీడీపీ ఫలితాన్ని మార్చేంత స్థాయిలో ఉండదని అంటున్నారు.

కానీ, ప‌వ‌న్ ప‌రిస్థితి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ మాట‌కి ఓట్లు రాలే పరిస్థితి ఉంది. దీంతో టీడీపీ అధినేత ప‌వ‌న్‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌నే డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. కానీ, ప‌వ‌న్ మాత్రం చీటికీ మాటికీ.. ప్ర‌త్యేక హోదా స‌హా ఆక్వాపార్కు, ఉద్దానం కిడ్నీలు, పోల‌వ‌రం రైతుల విష‌యాల్లో ప్ర‌భుత్వాన్ని క‌డిగేస్తూనే ఉన్నాడు. అయినా.. బాబు మాత్రం ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని బ‌ట్టి.. ప‌వ‌న్ లేక‌పోతే.. బాబుకు టెన్ష‌నే అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.