టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ పనైపోయిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ ప‌నైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహ‌న్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం మెద‌క్ జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన బాబూ మోహ‌న్ మెద‌క్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నిక‌తో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహ‌న్ రెండుసార్లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను ఓడించాడు. ఈ రెండు ఎన్నిక‌ల్లోను టీడీపీ త‌ర‌పున గెలిచిన బాబూ మోహ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి మ‌రోసారి దామోద‌రను ఓడించాడు. ఇక దామోద‌ర రాజ‌న‌ర్సింహ 2004, 2009 ఎన్నిక‌ల్లో బాబూ మోహ‌న్‌ను ఓడించారు.

ఇక కాంగ్రెస్‌లో ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన దామోద‌ర రాజ న‌ర్సింహ ప్ర‌స్తుతం ఆ పార్టీలో డ‌మ్మీ అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డంతో శాస‌న‌స‌భ‌లో ఆయ‌న వాణి వినిపించే అవ‌కాశం లేదు. దీంతో ఆయన కేవ‌లం ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మైపోయారు. ఇక ప్ర‌స్తుతం టీ కాంగ్రెస్‌లో అంతా కోమ‌టిరెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, జీవ‌న్‌రెడ్డి, డీకే.అరుణ లాంటి వారి హ‌వా న‌డుస్తోంది. గ‌తంలో ద‌ళిత ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండి, ఉప ముఖ్య‌మంత్రిగా ఓ వెలుగు వెలిగిన దామోద‌ర ప్లేస్‌ను ఇప్పుడు మ‌ధిర ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క్ ఆక్ర‌మించేశారు. దీంతో దామోద‌ర టీ కాంగ్రెస్‌లో రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిపోయారు.

ఇక కాంగ్రెస్‌లో ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయ‌న్ను టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. అక్క‌డ ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబూ మోహ‌న్ తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ అంతా టీఆర్ఎస్ వేవ్ ఉన్నా ఆందోల్‌లో మాత్రం బాబూ మోహ‌న్ కేవ‌లం 3 వేల ఓట్ల‌తోనే విజ‌యం సాధించారు.

ఇక ఈ మూడేళ్ల‌లో కూడా ఆయ‌న ప‌నితీరు స‌రిగా లేక‌పోవ‌డంతో సొంత పార్టీ నేత‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. కేసీఆర్ స‌ర్వేలో సైతం ఆయ‌న‌కు లీస్ట్ ర్యాంకే వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబూమోహ‌న్‌ను ప‌క్క‌న పెట్టేసి ఆయ‌న ప్లేస్‌లో రాజ‌న‌ర్సింహ‌ను టీఆర్ఎస్‌లోకి తీసుకువ‌చ్చేందుకు కేసీఆర్ ప్లాన్ వేశారు. ఈ ప‌నిని ఆయ‌న మంత్రి హ‌రీష్‌రావుకు అప్ప‌గించ‌గా ఆయ‌న మంత్రాంగం న‌డుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా కేసీఆర్ దెబ్బ‌తో టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ ప‌నైన‌ట్టే క‌న‌ప‌డుతోంది.