బాబుకు యాంటీగా ప‌వ‌న్‌ను న‌డిపిస్తోంది వాళ్లేనా..!

`ప‌వ‌న్‌, చంద్రబాబు ఎప్పుడూ భాయి-భాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంది` ఇదీ కొంత‌కాలం క్రితం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌! నిజ‌మే.. సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ధ్య‌.. స‌త్సంబంధాలే ఉన్నాయి. దీనివ‌ల్లే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌వన్ మ‌ద్ద‌తు త‌మ‌కు ఉంటుంద‌ని, టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు అంతా న‌మ్మ‌కంతో ఉన్నారు. కానీ `2019 ఎన్నిక‌ల వ‌రకూ ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయం. మా వైఖ‌రి త‌ట‌స్థం` అని చెప్పి.. చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చారు ప‌వ‌న్‌! మ‌రి ఇద్ద‌రి మ‌ధ్య ఈ గ్యాప్‌లోనే ఎందుకింత దూరం పెరిగింది?  బాబుకు యాంటీగా ప‌వ‌న్‌ను మార్చిందెవ‌రు అనే సందేహాలు అంద‌రిలోనూ ఉన్నాయి. అయితే దీనికి బ‌ల‌మైన కార‌ణాలు కూడా లేక‌పోలేద‌ని స‌మాచారం!! 

నంద్యాల కీ ఫైట్‌లో తాము ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని జ‌న‌సేనాని ప్ర‌క‌టించ‌డంతో.. టీడీపీకి గొంతులో వెల‌క్కాయ ప‌డిన‌ట్టు అయింది. మొన్న సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీలోనూ ఈ అంశంపై వీరిద్ద‌రి మ‌ధ్య ఈ చ‌ర్చ జరిగింది. ఇక ప‌వ‌న్ మ‌ద్దతు త‌మ‌కేన‌ని అంతా భావించారు. నంద్యాల‌లో నేత‌లు కూడా ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టేశారు. కానీ చివ‌రికి అంద‌రికీ షాక్ ఇచ్చాడు జన‌సేనాని. మ‌రి టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ రావ‌డానికి కార‌ణం.. ఇరు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ నిర్వ‌హించిన‌ ఎట్‌హోమ్. ఇందులో న‌ర‌సింహ‌న్‌-ప‌వ‌న్ భేటీతోనే మొత్తం సీన్ రివ‌ర్స్ అయిపోయింద‌ని స‌మాచారం!!

ఈ భేటీలో ఏపీ రాజ‌కీయాల‌పై వీరిద్ద‌రూ చ‌ర్చించుకున్నార‌ట‌. ఈ స‌మ‌యంలోనే ప‌వ‌న్‌కు కేంద్ర పెద్ద‌ల అభిమ‌తాన్ని ప‌వ‌న్‌కు న‌ర‌సింహ‌న్ వివ‌రించార‌ట‌. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ-టీడీపీ మ‌ధ్య దూరం పెరుగుతోంది. సీఎం చంద్రబాబుకు స‌న్నిహితంగా ఉంటున్న వారందరినీ కేంద్రం దూరం చేస్తోంది. అలాగే కొత్త మిత్రుల‌ను వెతుక్కుంటోంది. ఇటీవ‌ల వైసీపీతోనూ దోస్తీ బ‌ల‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇటు టీడీపీకి గుబ్‌బై చెప్పి.. వైసీపీతో ఎన్నిక‌లకు వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌వ‌న్‌కు వివ‌రించార‌ట‌. ఇదే స‌మ‌యంలో బీజేపీ-వైసీపీకి తోడు జ‌న‌సేన కూడా క‌లిస్తే బాగుంటుంద‌ని బీజేపీ పెద్ద‌లు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని ప‌వ‌న్‌కు తెలిపార‌ని స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌ట‌స్థంగా ఉండాల‌ని ప‌వ‌న్‌ను న‌ర‌సింహ‌న్ కోరార‌ని తెలుస్తోంది. అనంత‌రం ప‌వ‌న్ త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా టీడీపీ నేత‌లు దిక్కుతోచని స్థితిలో ప‌డిపోయారు. అయితే దీనిని కొట్టిపారేస్తున్న వారు కూడా లేక‌పోలేదు. హోదా ఇవ్వ‌నందుకు ప‌వ‌న్‌.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డార‌ని, అలాంటప్పుడు బీజేపీ నేత‌ల‌తో ఎందుకు క‌లుస్తార‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే వాళ్లు లేక‌పోలేదు. ఒక‌వేళ గెలిస్తే.. త‌మ వ‌ల్లే గెలిచార‌నే ప్ర‌చారం ఎక్కువ‌వుతుంద‌ని వివ‌రిస్తున్నారు. మొత్తానికి బీజేపీ నేత‌ల మంత్రం ఫ‌లించింద‌నే చెప్పాలి!!