పగలు కలవరు ..చీకటైతే కనబడరు : బాబు మోహన్

October 11, 2018 at 3:41 pm

బాబూమోహ‌న్‌కు కోపం వ‌చ్చింది. త‌న‌కు టికెట్ ఇవ్వ‌ని కేసీఆర్‌ను తియ్య‌గా తిట్టిపారేశారు. ఆయ‌న క‌డుపులో ఉన్న‌దంతా క‌క్కేశారు. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా గుర్తింపు పొందిన బాబూమోహ‌న్‌కు 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి అందోల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టారు. తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేసి, ఏకంగా 105మంది అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రికి మాత్రం టికెట్లు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ ఇద్ద‌రిలో బాబూమోహ‌న్ కూడా ఉన్నారు. కేసీఆర్ నిర్ణ‌యంతో షాక్ తిన్న బాబూమోహ‌న్‌.. కొద్దిరోజుల పాటు సైలెంట్‌గానే ఉన్నారు. కేసీఆర్ నుంచి ఫోన్ వ‌స్తుందేమోన‌న్న ఆశ‌తో ఎదురు చూశారు. కానీ.. అటువైపు నుంచి ఎలాంటి స్పంద‌నా రాక‌పోవ‌డంతో త‌న‌దాని తాను చూసుకున్నారు.

అయితే.. ఇటీవ‌ల ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. టీఆర్ఎస్‌లో త‌న‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేదని, టికెట్ ఇవ్వ‌పోవ‌డానికి కూడా కార‌ణాలు చెప్ప‌లేద‌ని.. క‌నీసం ఫోన్ కూడా చేయ‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు తాను ఫోన్ చేసిన కూడా కేసీఆర్ స్పందించ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక ఇక్క‌డి నుంచే ఆయ‌న మాట‌ల దాడిని పెంచారు. ఈ ప్ర‌పంచంలో సెక్రటేరియ‌ట్‌కు రాకుండా పాల‌న సాగించిన ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆరేన‌ని బాబూమోహ‌న్ ఎద్దేవా చేశారు. క‌నీసం మంత్రులు, ఎమ్మెల్యేల‌కు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా ఫాంహౌస్‌లో ముసుగేసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని ఆయ‌న తీవ్ర స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్‌ను క‌లిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు గంట‌ల‌కొద్దీ వేచి చూసేవార‌నీ.. అయినా క‌లిసే అవ‌కాశం రాక‌పోయేద‌ని.. ఇందులో తానుకూడా ఒక‌రిన‌ని బాబూమోహ‌న్ మండిప‌డ్డారు. పొద్దంతా క‌ల‌వ‌రు.. రాత్రి అయిందంటే క‌న‌బ‌డ‌రంటూ ఆయ‌న చుర‌క‌లు అంటించారు. అంతేగాకుండా.. కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాద విష‌యాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. బ‌స్సు ప్ర‌మాదంలో అంత‌మంది చ‌నిపోయినా.. క‌నీసం అటువైపు తొంగిచూడ‌లేద‌ని.. ప్ర‌జ‌ల్ని ప‌రామ‌ర్శించ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ‌లోనే రోడ్ల‌పైనే హ‌త్యలు జ‌రుగుతున్నాయ‌నీ.. ఇలాంటి తెలంగాణ‌నేనా మ‌నం కోరుకున్న‌ది అంటూ.. దుయ్య‌బ‌ట్టారు. ఏదేమైనా.. ఆందోల్‌లో టీఆర్ఎస్‌ను బాబుమోహ‌న్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మ‌రి.

పగలు కలవరు ..చీకటైతే కనబడరు : బాబు మోహన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share