టీడీపీకి… ఆ వ‌ర్గాలు దూర‌మా?!

ఏపీలో విస్తృత నెట్ వ‌ర్క్ ఉన్న పార్టీ తెలుగుదేశం. అన్న‌గారి మీద అభిమానంతో కుటుంబాల‌కు కుటుంబాలే ఈ పార్టీకి సేవ చేశాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో కొంత దూర‌మ‌య్యాయి. అయితే, ఇప్పుడు టీడీపీ అంటి పెట్టుకుని ముప్పైఏళ్లుగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొని జండా మోసిన కుటుంబాలు కూడా ఇప్పుడు బాబు వైఖ‌రితో పార్టీకి దూర‌మ‌వుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నా వారికి రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంతో ఆ సామాజిక వర్గాల్లో తమకు తగిన భరోసా లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో ఉద్యోగుల వయో పరిమితిని పెంచుతూ, 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించినా ఆ ఆనందం ఉద్యోగుల్లో మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అధికారులపై రాజకీయ పెత్తనం, పథకాల అమలులోనూ వారి జోక్యం, కింది స్థాయి ఉద్యోగులను అవినీతి పరులుగా చిత్రీకరించే సంఘటనలతో ఉద్యోగుల్లో కూడా క్రమేపీ అసంతృప్తి రేగుతోంది. మూడేళ్ల పాలనలో ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసినా వాటిని పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకుపోలేకపోతున్నారు. మంత్రులు దాదాపుగా అంద‌రూ ఎవ‌రి బిజినెస్‌ల‌లో వారు బిజీగా ఉన్నారు.

దీంతో వివిధ సామాజిక వర్గాలను , ముఖ్యంగా టీడీపీకి సేవ‌చేసిన వారిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు చేపట్టడం లేదన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ఎన్టీఆర్‌ నుంచి టీడీపీతోనే తమ జీవనం అన్న రీతిలో గిరిజనులు వ్యవహరించే వారు. క్రమేణ ఈ సామాజిక వర్గంలో కొందరు క్రిష్టియన్లుగా మారడంతోపాటు గిరిజనులకు టీడీపీలో తగు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం మెల్లమెల్లగా టీడీపీకి దూరమవుతోంది. ఎస్సీల వర్గీకరణ కూడా టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎస్సీలు మొదటి నుంచి టీడీపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చినా రిజర్వేషన్‌ పుణ్యమా అని ఎమ్మెల్యేలైన సందర్భాలు ఉన్నాయి.

వెర‌సి ఈప రిణామాలు .. ఏపీలో టీడీపీని ఓ సంకుల స‌మ‌రంలోకి నెట్టేస్తున్నాయ‌న్న ఫీలింగ్ క‌లుగుతోంది. ఏదేమైనా 2019లో ఎలాగైనా అధికారం అట్టేపెట్టుకోవాల‌ని భావిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ఇవ‌న్నీ మింగుడు ప‌డ‌ని అంశాలే. అయినా… ఇవ‌న్నీ క్షేత్ర‌స్థాయిలో నిజాలు. సో.. ఇప్ప‌టికైనా బాబు వీటిని గ‌మ‌నించి ఎక్క‌డిక‌క్క‌డ ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌డితేనే ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంది!!