తెలంగాణ‌లో నంద్యాల త‌ర‌హా ఉప ఎన్నిక‌

త్వరలోనే తెలంగాణలోనూ నంద్యాల లాంటి పోరు తప్పేలా లేదు. ఉప ఎన్నికల స్పెషలిస్ట్‌ పార్టీగా గుర్తింపు పొందిన గులాబీ పార్టీ… త‌న స‌త్తా చాటేందుకు మరోసారి అదే దారి ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ఎంపీ స్థానాల‌కు, రెండు ఎమ్మెల్యే స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ వార్ వ‌న్‌సైడ్ చేసేసింది.

ఇక పాలేరు, ఖేడ్ అసెంబ్లీ స్థానాల‌తో పాటు వ‌రంగ‌ల్‌, మెద‌క్ ఎంపీ స్థానాల ఉప ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇక కేసీఆర్ సీఎం అయ్యి మూడేళ్లు పూర్తికావడంతో.. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఉప ఎన్నికలు అనివార్యం అని గులాబీ బాస్ భావిస్తున్నార‌ట‌. అందుకే ఆయ‌న మ‌రో ఉప ఎన్నిక‌కు కావాల‌ని వెళుతున్నార‌ని స‌మాచారం.

ఇక పూర్తి వివ‌రాల్లోకి వెళితే తెలంగాణ సర్కార్‌ రైతు సమన్వయ సమితుల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితి చైర్మన్‌ ఎవరికి ఇవ్వాలనే దానిపై కేసీఆర్‌ కసరత్తు చేశారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నార‌ట‌. ఇది కేబినెట్ హోదా ఉన్న ప‌ద‌వి. ఆయ‌న ఈ ప‌ద‌వి చేప‌ట్టినా ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న రూల్ లేదు. అయితే కేసీఆర్ మాత్రం ఇక్కడ గుత్తాతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల్లో వేరే క్యాండెట్‌ను పెట్టి గెలిపించి స‌త్తా చాటాల‌ని కేసీఆర్ ప్లాన్‌.

గుత్తా ఇప్పుడు ఎంపీగా రాజీనామా చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కోదాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఇక న‌ల్గొండ ఎంపీ సీటుకు జ‌రిగే ఉప ఎన్నిక‌ల‌ను కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప్రీపోల్‌గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ ఎంపీతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానానికి కూడా ఉప ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్‌ ఉనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక న‌ల్గొండ ఎంపీ ప‌రిధిలో గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కేవ‌లం సూర్యాపేట సీటు గెలుచుకుంది. ఈ సీటు ప‌రిధిలోనే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, ఆయ‌న భార్య ప‌ద్మావ‌తి, జానారెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లాంటి కాంగ్రెస్ హేమాహేమీలు ఉన్నారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు ఈ ఎంపీ సీటులో టీఆర్ఎస్‌ను గెలిపించుకుని కాంగ్రెస్‌ను మాన‌సికంగా దెబ్బ‌తీసేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్ వేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. అందుకే గుత్తాతో కావాల‌నే ఎంపీ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేయిస్తున్నారు.