మళ్ళీ మోసం చేసిన బీజేపీ … దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ .. పోలవరం లేనట్టే ..!

ఏపీకి వ‌ర‌ప్ర‌దాయిని అని తెలుగు దేశం నాయ‌కులు, సీఎం చంద్ర‌బాబు ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న పోల‌వరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్య‌త తామేన‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మ‌రో మెలిక పెట్టింది. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోల‌వ‌రం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామ‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ ట‌ర్న్ తీసుకుంది. 2019లోగా ప్రాజెక్టును పూర్తిచేయాల‌ని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం మ‌రో షాక్ ఇచ్చిన‌ట్ల‌యింది.

పోలవరానికి వంద శాతం నిధులు ఇస్తున్నందునే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఇప్పటిదాకా గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేత‌ల ఆనందం కేంద్ర‌మంత్రి ఉమాభారతి సమాధానంతో ఆవిరైపోయింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వంద శాతం నిధులు ఇస్తుందని..ఇలా దేశంలో ఎప్పుడూ జరగలేదని.. సీఎం చంద్రబాబు, సాగునీటి శాఖ మంత్రి దేవినేని మహేశ్వరరావులు ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి ఉమాభారతి అసలు విషయం బయటపెట్టారు. 2014 ఏప్రిల్ నాటికి ఉన్న అంచనా వ్యయాన్నే తాము భరిస్తామే తప్ప..తర్వాత పెరిగిన వ్యయం తమకు సంబంధం లేదని కేంద్రం చేతులెత్తేసింది.

అప్పటి వ్యయం ప్రకారం అయితే అన్నీ కలుపుకుని 16,000 వేల కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మొత్తం  వ్యయం రూ. 32,000 కోట్లు . చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ట్రాన్స్ స్ట్రాయ్ ఇచ్చిన పనుల కాంపోనెంట్ లోనే అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.2000 కోట్ల మేర పెంచారు.  అయితే ఈ మొత్తాన్ని కూడా సర్కారే భరించుకోవాలి. అంతే గాక కాంట్రాక్టర్ ట్రాన్స్స్ స్ట్రాయ్ అయినా ఇప్పుడు అన్ని పనులు సబ్ కాంట్రాక్టుల కేటాయింపు నుంచి అన్నీ చంద్రబాబే చూస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాజ్యసభలో ఉమాభారతి పోలవరం అదనపు వ్యయం గురించి వివరణ ఇచ్చారు. 2014 ఏప్రిల్‌1 నాటికి గల పోలవరం అంచనా వ్యయం వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ తరువాత వేసిన అంచనా వ్యయంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్ప‌ష్టంచేశారు. పెరిగిన అంచనా వ్యయం ప్ర‌కారం పోలవరం ప్రాజెక్టులో కేంద్రం భరించే వ్యయం కేవలం 50 శాతం మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వమే దీనికి అవసరమైన నిధులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుందన్న మాట.