ఇలా అయితే క‌మ‌లం విక‌సించ‌డం క‌ష్ట‌మే!

September 18, 2017 at 3:30 pm
BJP, AP, Venkaiahnaidu

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతున్న బీజేపీకి.. ఏపీ ద‌గ్గ‌ర బ్రేక్ ప‌డింది. ఏ రాష్ట్రం విష‌యం లోనూ ఇంత గంద‌ర‌గోళ ప‌డ‌ని అధిష్టానం.. ఏపీలో ఎలా ముందుకువెళ్లాలో తెలియ‌క తికమ‌క ప‌డుతోంద‌ట‌. స్ప‌ష్ట‌మైన వ్యూహాల‌తో.. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేసే బీజేపీ పెద్ద‌ల‌కు.. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి ప‌డింద‌ట‌. ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో.. ఏపీ బీజేపీ నాయ‌కులు కొన్ని అంశాల్లో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నార‌ట‌. ఏ పార్టీతో స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లాలి? సొంతంగా ఎదిగేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశాల‌పై ఇప్పుడు ఏపీ బీజేపీలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని స‌మాచారం.

అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా రెప‌రెప‌లాడాల‌ని ప్ర‌ధాని మోదీ-పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా ద్వ‌యం.. ఒక‌ప‌క్క ప్రణాళి క‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల‌పై ఎప్ప‌టినుంచో దృష్టిసారించింది. సొంతంగా ఎదిగేం దుకు అవ‌కాశ‌మున్న తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఇందుకు త‌గిన వ్యూహాన్ని కూడా అమ‌లు చేస్తోంది. తెలంగాణ‌లో ప‌క్కా వ్యూహం తో ముందుకు వెళుతుంటే ఆంధ్రా విష‌యంలో మాత్రం ఇంకా బీజేపీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితే ఉంద‌ట‌. ఏపీలో ఏ విధంగా ముందుకు వెళ‌దాం అనే అంశంపై ఇంకా స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం నేత‌ల‌ను ఇబ్బంది పెడుతోంద‌ని స‌మాచారం. రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రికి ఇవ్వాల‌నేదే ఇప్ప‌టికీ ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యానికి రాన‌ట్టుగానే ఉంద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌రకూ ఏపీ అధ్య‌క్షుడిగా ఉన్న హ‌రిబాబుకు కేంద్రమంత్రి ప‌ద‌వి దక్కకపోవడంతో.. ఇప్పుడు ఏపీ బీజేపీకి నాయ‌క‌త్వం కొర‌వ‌డింది. ఎప్ప‌టినుంచోదీనిపై స్ప‌ష్ట‌త క‌రువైంది. ఇక‌ ఏపీలో భాజ‌పా పోషించాల్సిన పాత్ర ఏంట‌నేది స్ప‌ష్ట‌త కావాల‌ని రాష్ట్ర నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీతో క‌లిసి పోటీ చేస్తామా, లేదా సొంతంగానే ముందుకు సాగుతామా అనేది తేల్చాల‌ని బీజేపీ రాష్ట్ర నేత‌లు కోరుతున్నారు. ఇక జ‌న‌సేనతో ఎలాంటి సంబంధాలు నెర‌పాల‌నేది కూడా స్ప‌ష్ట‌త కావాల‌ని అంటున్నారు. ఈ అంశాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా రాష్ట్రంలో పార్టీ సొంతంగా ఎదిగేందుకు కృషి చేయాల‌ని ఆదేశిస్తే ఎలా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

మూడేళ్లుగా బీజేపీ తీరు చూస్తే.. ఆంధ్రాలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగే ప్ర‌య‌త్నాలు ఇంత వ‌ర‌కూ చేయ‌లే దు. ఒక‌వేళ ప్ర‌య‌త్నం చేసినా.. దానిని వెంక‌య్య వంటి వారు అప్పట్లో వ్య‌తిరేకించేవారనే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

ఇటువంటి స‌మ‌యంలో బీజేపీ ముందు ఎన్నో ప్ర‌శ్న‌లు ఉన్నాయి. ఏపీలో సొంతంగా ఎద‌గాలంటే చంద్ర‌బాబు స‌ర్కారుపై పోరాటాలు సాగించాలా? వైకాపాను ద‌గ్గ‌ర చేర్చుకోవాలా? మూడో ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాలంటే జ‌న‌సేన వంటి పార్టీల‌తో జ‌త క‌ట్టాలా? మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ముందు వెతుక్కోవాలి! ఇన్ని స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ వుతున్న బీజేపీ.. ఇక ఏపీలో ఎలా ఎదుగుతుందే అభిప్రాయాలు లేక‌పోలేదు!!

 

ఇలా అయితే క‌మ‌లం విక‌సించ‌డం క‌ష్ట‌మే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share