2019 ఎల‌క్ష‌న్స్‌లో సీటు క‌ట్‌!.. మంత్రికి షాక్

2019 ఎన్నిక‌ల్లో ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి సీటు రాదా ?  ఆయ‌న‌కు సీటుకు ఎర్త్ పెట్టి…ఆయ‌న‌కు షాక్ ఇచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ ? అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం సీటును టీడీపీ బీజేపీకి ఇచ్చింది. అక్క‌డ టీడీపీ సీటు కోసం జ‌డ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఈలి నాని పోటీప‌డ్డారు. అయినా చంద్ర‌బాబు ఈ సీటును బీజేపీకి ఇవ్వ‌డంతో బీజేపీ మాజీ కౌన్సెల‌ర్‌గా ఉన్న పైడికొండ‌ల‌కు సీటు ఇచ్చింది.

జిల్లాలో బ‌లంగా వీచిన టీడీపీలో గాలిలో మాణ‌క్యం గెల‌వ‌డం..ఆ వెంట‌నే చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా అయిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ఈ మూడేళ్ల ప్ర‌యాణంలో మంత్రికి, టీడీపీ నాయ‌కుల‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. మంత్రికి, జ‌డ్పీ చైర్మ‌న్ బాపిరాజుకు మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండిపోతోంది.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ తాడేప‌ల్లిగూడెం సీటు కాకుండా పాల‌కొల్లు సీటుపై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బాబ్జిని బీజేపీ లైన్లో పెడుతోంది. బాబ్జి సైతం సీటు కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రెండు పార్టీల మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కొన‌సాగే సూచ‌న‌లే ఉండ‌డంతో ఈ సారి టీడీపీ సైతం గూడెంలో క్యాడ‌ర్ కాపాడుకునేందుకు గూడెం నుంచి టీడీపీ అభ్య‌ర్థిని రంగంలోకి దింపి….బీజేపీకి పాల‌కొల్లు సీటును ఇవ్వాల‌న్న యోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు స‌మాచారం.

తాడేప‌ల్లిగూడెంలో 1999లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది. 2004లో కాంగ్రెస్‌, 2009లో ప్ర‌జారాజ్యం గెలవ‌గా, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ గెలిచింది. ఇప్ప‌టికే గూడెంలో టీడీపీ క్యాడ‌ర్ చెల్లాచెదురుగా ఉంది. అక్క‌డ బీజేపీ ఎమ్మెల్యే ఉండ‌డంతో టీడీపీ క్యాడ‌ర్‌ను జ‌డ్పీచైర్మ‌న్ బాపిరాజు త‌న భుజ‌స్కంధాల మీద వేసుకుని కాపాడుతున్నారు. ఈ క్ర‌మంలో మంత్రి వ‌ర్సెస్ జ‌డ్పీచైర్మ‌న్ మ‌ధ్య త‌ర‌చూ వివాదాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఈ సారి ఇక్క‌డ ప‌ట్టు నిలుపుకునేందుకు గూడెంలో పోటీ చేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు కోరుతున్నారు. టీడీపీ అధినాయ‌క‌త్వం సైతం ఇక్కడ బ‌ల‌మైన నాయ‌కులు ఉండి కూడా వీక్ అయ్యేందుకు ఒప్పుకునే ప‌రిస్థితుల్లో లేదు.

ఇక గూడెం త‌ప్పుకుంటే జిల్లాలో బీజేపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా పాల‌కొల్లు మాజీ ఎమ్మెల్యే బాబ్జి మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. ఆయ‌న‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌, మాజీ ఎమ్మెల్యే కావ‌డంతో ఈ సారి బీజేపీ పాల‌కొల్లు సీటు కోసం గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్ట‌నుందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి టీడీపీ-బీజేపీ పొత్తులో మంత్రి మాణిక్యంకు టిక్కెట్టు క‌ష్టంగానే క‌నిపిస్తోంది.