ఏపీలో ఆ మంత్రిగారి శాఖ‌లో అవినీతి కంపు..!

September 23, 2017 at 10:16 am
BJP, Kamineni Srinivasrao, Minister, Scam

ప్ర‌తిష్టాత్మ‌క వైద్య విద్యా శాఖ‌లో అవినీతి కంపు కొడుతోందని సోష‌ల్ మీడియా స‌హా ప‌లు వెబ్ సైట్ల‌లో క‌థ‌నాలు తండోప తండాలుగా వ‌స్తున్నాయి. ఏపీలో ఇప్ప‌టికే అవినీతి తాండ‌విస్తోంద‌ని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేత‌లు భారీగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని పేర్కొన్న స‌ద‌రు సైట్లు ఇప్పుడు టీడీపీ మిత్ర ప‌క్షం బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ చూస్తున్న వైద్య విద్యా శాఖ‌లోనూ అవినీతి మ‌లేరియాలా విస్త‌రిస్తోంద‌ని క‌థ‌నాల‌ను పోస్ట్ చేశాయి. నిజానికి అవినీతికి, ఆరోప‌ణ‌ల‌కు ఆమ‌డం దూరం ఉండే.. కామినేని.. త‌న శాఖ‌పై ఇలా ఆరోప‌ణ‌లు రావ‌డాన్ని ఏలా చూస్తారో చూడాలి. వివ‌రాల్లోకి వెళ్తే..

వైద్య రంగానికి అవ‌స‌ర‌మైన అన్ని ప‌రిక‌రాల‌ను స్థానికంగా త‌యారు చేసుకునే ల‌క్ష్యంతో మెడ్ టెక్ జోన్‌కు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. సిరంజి నుంచి అధునాత శ‌స్త్ర చికిత్స‌ల‌కు అవ‌స‌రమైన అన్ని ప‌రిక‌రాలూ ఈ జోన్‌లో త‌యార‌వుతాయి. దీనిని విశాఖ‌లో నిర్మించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. అయితే, ఈ బాధ్య‌త‌ల‌ను వైద్య విద్యా శాఖ‌కు అప్ప‌గించారు. ఇప్పుడు, ఇక్క‌డే అవినీతి జ‌రిగింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మెడ్ టెక్ జోన్‌కు సీఈవోగా డాక్ట‌ర్ జితేంద్ర‌శ‌ర్మ‌ను నియ‌మించారు. అయితే, ఆయ‌న రూ.500 కోట్ల ఈ ప్రాజెక్టును రూ.2400 కోట్ల‌కు పెంచార‌ని, ఆమేర‌కు టెండ‌ర్లు పిలిచార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఓ సంద‌ర్భంలో ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అయితే, ఈయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోక‌పోగా.. ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ క‌ల్పించారు. మేనేజింగ్ డైరక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. ఇక‌, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య‌ను మెడిటెక్ జోన్ ఛైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్నారు. అయితే పరిపాలనా కారణాలతో అంటూ పూనం మాలకొండయ్య నుంచి ఎండీ ప‌ద‌విని త‌ప్పించి దానిని జితేంద్ర‌కే అప్ప‌గించారు. అయితే పూనం మాలకొండయ్య ఛైర్ పర్సన్ గా మాత్రం కొనసాగుతారని గురువారం విడుద‌ల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితమే మెడ్ టెక్ జోన్ నిర్మాణానికి సంబంధించి రూ.500 కోట్ల విలువైన టెండర్ పనులను రూ.2400 కోట్లకు కట్టబెట్టారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు కొందరు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వాళ్ళు సంస్థ సమాచారాన్ని బయటకు పంపారంటూ మెడ్ టెక్ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెడ్‌ టెక్‌ జోన్‌ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆ జోన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌(ప్లానింగ్‌) జూడిష్‌ రాజ్ మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మ‌రి దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన మంత్రి కామినేని మౌనంగా ఉన్నారంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున క‌థ‌నాలు, విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి

 

ఏపీలో ఆ మంత్రిగారి శాఖ‌లో అవినీతి కంపు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share