తెలంగాణ‌లో బీజేపీకి వాయిస్ క‌ట్‌

తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార ప‌క్షం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించిన బీజేపీ ఇప్ప‌టికిప్పుడు సైలెంట్ అయిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మియాపూర్ భూములు స‌హా మిష‌ణ్ భ‌గీర‌థ‌లో లోపాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌తో కేసీఆర్‌ను ఇరుకున పెట్టారు క‌మ‌లం నేత‌లు. అయితే, అనూహ్యంగా వాయిస్‌ను ఇప్పుడు క‌ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యంపైనే తెలంగాణ‌లో అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే…

తెలంగాణ‌లో కొంత పుంజుకున్న బీజేపీ నేత‌లు.. అధికార ప‌క్షాన్ని విమ‌ర్శించి ఇరుకున‌పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంటే 2019లో ఎలాగైనా గ‌రిష్టంగా సీట్ల‌ను పొందాల‌ని డిసైడ్ అయ్యారు.ఈ క్ర‌మంలోనే క‌మ‌ల ద‌ళం కేసీఆర్, కేటీఆర్ సహా ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో బీజేపీ సార‌ధి అమిత్ షా సైతం తెలంగాణ కు వ‌చ్చిన సంద‌ర్భంలో కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. తాము ఎంత‌గా డ‌బ్బులు ఇస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. దీంతో మిగిలిన వారు సైతం కేసీఆర్ అండ్ కోపై విమ‌ర్శ‌లు సంధించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇటీవ‌ల కాలంలో మాత్రం బీజేపీ సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్‌కి కేసీఆర్ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే దీనికి కార‌ణంగా క‌నిపిస్తోంది. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వ‌చ్చాక రాష్ట్ర రాజ‌కీయాల్లో అనూహ్య‌మైన మార్పులు వ‌చ్చాయి. కేసీఆర్ ఢిల్లీలో మోడీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గానే.. అక్క‌డి నుంచి తెలంగాణ నేత‌ల‌కు ఆదేశాలు వ‌చ్చాయ‌ని, రాష్ట్ర స‌ర్కారుపై ప‌న్నెత్తు మాట అన‌కూడ‌ద‌ని వాళ్లు ఆదేశించార‌ని అంటున్నారు. దీంతోనే రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు సైలెంట్ అయిపోయార‌ని తెలుస్తోంది.

అయితే, సెప్టెంబ‌రు 17 త‌ర్వాత మాత్రం ఈ ప‌రిస్థితి ఉండేలా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. అప్ప‌టి నుంచి బీజేపీ నేత‌లు విజృంభిస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌ర‌ప‌త్రాలు పంచ‌డం, ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేయ‌డం వంటి అజెండాను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. అయితే, అధిష్టానం నుంచి ప్ర‌స్తుతానికి మాత్రం మౌనంగా ఉండాల‌ని ఆదేశం రావ‌డంతోనే ఇలా జ‌రుగుతోంద‌ని అంటున్నారు. మొత్తానికి ఇప్ప‌టికైతే.. కేసీఆర్‌కి జీ .. హుజూర్ అనే ప‌రిస్థితే క‌నిపిస్తోంది.