పొత్తుల కోసం బీజేపీ `స‌ర్వే` డ్రామాలు

October 8, 2018 at 12:14 pm

వచ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? మ‌ళ్లీ సొంతంగా అధికారం చేజిక్కించుకోగ‌ల‌దా? అనే ప్ర‌శ్న‌లు ఎంత‌లా వినిపిస్తున్నాయో.. స‌మాధానం కూడా అందుకు త‌గిన‌ట్లుగానే.. అంత‌కంటే గ‌ట్టిగానే వినిపిస్తోంది. బీజేపీ ఈసారి సొంతంగా అధికారంలోకి రావ‌డం క‌ల్ల అనే విష‌యం.. ప్ర‌జ‌ల‌కే కాదు క‌మ‌ల‌నాథుల‌కు కూడా అర్థ‌మైపోయింది. అందుకే.. ఈసారి ఫ‌లితం ఎలా ఉన్నా.. ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని.. ఒక‌వేళ‌ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసే అవ‌కాశం వ‌స్తే.. ప్ర‌తిప‌క్షంలో అయినా కూర్చుందామ‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. కానీ అధికారాన్ని ఆస్వాదిస్తున్న వారికి మాత్రం ఈ మాట‌లు రుచించ‌లేదేమో! అందుకే ఎలాగైనా ఈసారి కూడా అధికారంలోకి వ‌చ్చేయాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మిత్రులంద‌రూ ఒక్కొక్క‌రుగా దూర‌మ‌వుతుండ‌టంతో.. మ‌ళ్లీ కొత్త వాళ్ల‌ని ద‌గ్గ‌ర చేసుకునేందుకు స‌ర్వేల‌ను ఉప‌యోగించుకుంటున్నారు. పొత్తు పెట్టుకోవ‌డం వల్ల ఇరువురికీ లాభ‌మ‌ని.. చెప్ప‌డానికే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నార‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి.

లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌వుతున్న కొద్దీ.. సర్వేలు జోరందుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని అన్ని స‌ర్వేల్లోనూ వెల్ల‌డ‌వుతోంది. అయితే వీటిపై క‌మ‌ల‌నాథులు మాత్రం ఏమాత్రం దిగులు చెంద‌డం లేద‌ట‌. అంతేగాక వీటిని పొత్తుల కోసం ఎలా ఉప‌యోగించుకోవాలా అనే వ్యూహాల‌ను ర‌చిస్తున్నార‌ట‌. కొన్ని రోజుల క్రితం బీజేపీ ఓ అంతర్గత సర్వే చేయించుకుంది. అందులో ప్ర‌స్తుతం ఉన్న సీట్లలో 150 సీట్లకు కోత పడుతుందని తేలింది. ఈ సర్వే విషయం బయటకు వచ్చింది. బీజేపీ ఖండించలేదు. అలాగని వీటిని అంగీకరించలేదు. ఈ సర్వే ఆధారంగా.. ఎక్కడెక్కడ సీట్లు సంపాదించుకోవచ్చో.. కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు.. కొన్ని ఉత్తరాది మీడియా సంస్థలు ఫ్యాష్ సర్వేలు, రేటింగులు, అభిప్రాయసేకరణ పేరుతో.. వారానికో సర్వే ప్రకటిస్తున్నాయి. అందులో బీజేపీకి ఆదరణ తగ్గింది కానీ.. అధికారంలోకి వస్తుందని.. చెప్పుకొస్తున్నాయి. అయితే సర్వేలను ఏ రాజకీయ పార్టీ సీరియస్‌గా తీసుకోవడం లేదు.

విచిత్రమేంటంటే.. ఆ సర్వేలు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా ఏపీలోనూ స్పష్టమైన ఫలితాన్ని ప్రకటించాయి. మొన్నామధ్య కేసీఆర్‌.. కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని కలిస్తే.. ఆంధ్ర సీఎం చంద్ర‌బాబు కూడా బెంగాల్‌ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారని గంటల కొద్ది బ్రేకింగులు నడిపిన చానల్ కొన్నాళ్ల కిందట.. ఓ సర్వే ప్రకటించింది. అందులో బీజేపీకి పన్నెండు శాతం ఓట్ల వరకూ వేశారు. ఆ తర్వాత నిన్నటికి నిన్న ఆర్నాబ్ గోస్వామికి చెందిన చానల్ కూడా.. ఓ సర్వే ప్రకటించింది. ఇందులోనూ బీజేపీకి ప‌ట్టాభిషేకం చేశారు. అలాగే ఏపీలో బీజేపీకి పన్నెండున్నర శాతం ఓట్లు వేసుకున్నారు. మైనస్ ఓట్లు ఉంటే బీజేపీకి అవే పడతాయి కానీ ప్లస్ ఓట్లు ఎక్కడ వస్తాయని చాలా మందికి సందేహం క‌లిగింది. అస‌లే ఆ పార్టీకి ఏపీలో బ‌ల‌మైన క్యాడ‌ర్ లేదు. మ‌రి ఇదెలా సాధ్యంమ‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉండిపోయింది. స‌రే.. మ‌రి ఈ సర్వేలు ఎందుకు ప్రకటిస్తున్నారనే సందేహం చాలా మందికి ఉంది. దీనికి బీజేపీ నేతలు చెప్పే సమాధానం ఏమిటంటే.. పొత్తుల కోసమట.maxresdefault

తమకు పన్నెండు శాతం ఓటు బ్యాంక్ ఉంది. పొత్తులు పెట్టుకుంటే కలిసొస్తాయని.. ఇతర పార్టీలకు ధైర్యం చెప్పడానికి.. టెంప్ట్ చేయడానికట. ఉత్తరాదిలో సర్వే చేసి దక్షిణాదిలో ఫలితాలు ప్రకటిస్తే.. పొత్తుల కోసం వచ్చేస్తారా అనే లాజిక్‌ను మ‌రిచిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు క‌మ‌ల‌నాథులు. రహస్య మిత్రులుగా ఉన్నా.. టీఆర్ఎస్, వైసీపీ కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఇప్ప‌టికిప్పుడు సిద్ధంగా లేవ‌నే విష‌యం తేలిపోయింది. మ‌రి ఏ పార్టీల‌తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుదామ‌ని ఇలాంటి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో వారికే తెలియాలి!!

పొత్తుల కోసం బీజేపీ `స‌ర్వే` డ్రామాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share