ఢిల్లీ మొటిక్కాయ వేస్తే.. టికెటిచ్చారు!

October 22, 2018 at 10:48 am

పైకి తమది సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు గానీ.. భారతీయ జనతా పార్టీలో కూడా కాంగ్రెసును మించిన ముఠా కుమ్ములాటలు, ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడాలు లాంటి రాజకీయ సాధారణ సంగతులు పుష్కలంగా ఉంటూనే ఉంటాయి. తాజాగా ఆ పార్టీ తెలంగాణలో ప్రకటించిన అభ్యర్థుల తొలిజాబితాలో కూడా ఈ సంగతి తేలిపోతోంది. ఎందుకంటే.. గట్టి అవకాశాలు ఉన్న ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి స్థానిక నాయకులు, ముఠా తగాదాల కారణంగా దూరం పెట్టినప్పుడు.. ఢిల్లీ నాయకత్వం మొట్టికాయ వేసిన తర్వాతే.. ఆయన పేరును జాబితాలో చేర్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో కేవలం అయిదుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ మాత్రం రాష్ట్రంలో ఈసారి తాము అధికారంలోకి వచ్చేసేంత బలంగా ఎదిగిపోతున్నాం అని చెప్పుకుంటూ ఉంటుంది గానీ.. వారికి ఉన్న అయిదు సీట్లూ కేవలం హైదరాబాదు నగర పరిధిలోనివి మాత్రమే కావడం విశేషం. ఈ అయిదింటిలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కూడా ఒకటి.

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులకంటె చాలా దూకుడుగా.. హిందూ మతతత్వ వ్యాఖ్యలు చేయడం, ఇతర మతాల వారిని రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు చేయడంలో రాజాసింగ్ ఎప్పుడూ ముందుంటారు. చాలా దూకుడుగా ఉండే ఈ నాయకుడికి రాష్ట్ర పార్టీ నాయకత్వంతో విబేదాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే రాష్ట్ర పార్టీ మీద గుత్తాధిపత్యం నెరపుతుండే కొందరు వ్యక్తులు రాజాసింగ్ ను దూరం పెట్టారు. రాజాసింగ్ కూడా ఆ నడుమ పార్టీకి రాజీనామా చేశారు.

అయితే స్థానికంగా గోషామహల్ లో ఆయన బలమైన నాయకుడు అని గుర్తించిన ఢిల్లీ నాయకత్వం ఆయనను బుజ్జగించింది. గతంలో హైదరాబాదుకు వచ్చిన అమిత్ షా రాజాసింగ్ రాజీనామాను తిరస్కరించి పార్టీలో ఉండేలా చేశారు. అయితే తాజాగా భాజపా తయారుచేసిన అభ్యర్థుల తొలిజాబితాలో రాజాసింగ్ పేరు చేర్చలేదుట. ఆయన సిటింగ్ అభ్యర్థి అయినా.. పేరు పక్కన పెట్టి.. మిగిలిన వారి పేర్లకు చోటు కల్పించారుట. ఈ సంగతిని గుర్తించి. ఢిల్లీ నాయతక్వం మందలించడంతో.. చివరికి జాబితా ప్రకటించే సమయానికి రాజాసింగ్ పేరును కూడా చేర్చారని తెలుస్తోంది.

అధికారం దక్కే అవకాశం కూడా లేనప్పుడే.. ఇన్ని ముఠా కుమ్ములాటలు ఉంటే.. అధికారం కూడా దక్కిందంటే.. ముఠా కుమ్ములాటల్లో భాజపా కాంగ్రెసును మించిపోతుందని పలువురు అనుకుంటున్నారు.

ఢిల్లీ మొటిక్కాయ వేస్తే.. టికెటిచ్చారు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share