టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్‌

రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లో ఒంట‌రిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణ‌మైన రాజ‌కీయానికి అయినా తెర‌లేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్నా మ‌రోవైపు టీడీపీని వీలున్నంత వ‌ర‌కు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వ‌దులుకోవ‌డం లేదు. అటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణ‌గదొక్క‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతోంది.

ఈ క్ర‌మంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేత‌లు, రెండు రాష్ట్రాల సీఎంలు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుకోసం ఎంతో ఆశ‌తో వెయిట్ చేస్తున్నారు. పార్టీ బ‌లోపేతం కోసం వీరిద్ద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేల‌కు నియోజ‌క‌వ‌ర్గాల పెంపును ఆశ‌గా చూపి వారిని త‌మ పార్టీల్లో చేర్చేసుకున్నారు. అటు తెలంగాణ‌లో క‌న్నా ఏపీలో అయితే జంపింగ్ జ‌పాంగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిత్యం పాత వ‌ర్సెస్ కొత్త నాయ‌కుల మ‌ధ్య క‌ల‌హాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి వ‌ర్సెస్ ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింది.

చంద్ర‌బాబు, కేసీఆర్ ఇద్ద‌రూ ఫిరాయింపుల వ్య‌వ‌హారంలో చాలా మందికి నియోజ‌క‌వ‌ర్గాల పెంపును సాకుగా చూపేశారు. దీంతో రెండు పార్టీల్లోను ఓవ‌ర్‌లోడ్ ఎక్కువైంది. అయితే ఇప్పుడు ఇదే అంశంపై బీజేపీ వీరికి షాక్ ఇచ్చేలా క‌న‌ప‌డుతోంది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెంపు లేన‌ట్టేన‌ని బీజేపీ సంకేతాలిచ్చింది. తెలంగాణ‌లో అధికారం ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ సీట్లు పెంచితే అభ్య‌ర్ధుల ఎంపిక స‌వాలుగా మారుతుంద‌ని భావిస్తోంది.

ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ సీట్లు పెంచితే బీజేపీకి లాభం ఉండ‌ద‌ని, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలే ప్ర‌యోజ‌నం పొందుతాయ‌ని అమిత్ షాకు, కేంద్రానికి నివేదిక‌లు వెళ్లాయ‌ట‌. దీంతో త‌మ‌కు న‌ష్టం వ‌చ్చే ఈ ప‌నిని ప‌క్క‌న పెట్టేయాల‌ని బీజేపీ భావిస్తోంద‌ట‌. సీట్ల పెంపు లేక‌పోతే ఈ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయ‌కులు బీజేపీ వైపు మొగ్గు చూపే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. దీంతో రాజ‌కీయంగా చంద్ర‌బాబు, కేసీఆర్‌కు ఇది పెద్ద మైన‌స్‌.

ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో కొత్త‌గా ఎమ్మెల్యేలు అయిపోవాల‌ని ఎన్నో క‌ల‌లు కంటోన్న నాయ‌కుల‌కు ఇది పెద్ద షాక్ లాంటిదే. కేసీఆర్‌, చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిడి చేస్తే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గాల పెంపు లేన‌ట్టే.