బ‌ళ్లారిలో గాలి ఫ్యామిలీకి చెక్‌

క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి జిల్లా పేరు చెపితే మాజీ మంత్రి గాలి జనార్థ‌న్‌రెడ్డి పేరు ముందుగా గుర్తుకు వ‌స్తుంది. బ‌ళ్లారి మైనింగ్ మాఫియాతో కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కిన గాలి కేవ‌లం మంత్రిగా ఉండి క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌ను శాసించారు. అక్ర‌మాస్తుల కేసులో అరెస్టు అయ్యి గాలి జైలుకు వెళ్ల‌డంతో అక్క‌డ గాలి ఊపు త‌గ్గింది. ఇక వ‌చ్చే యేడాది క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో మ‌రోసారి గాలి బ‌ళ్లారిలో కీ రోల్ పోషిస్తాడా ? అన్న చ‌ర్చ‌లు క‌ర్ణాట‌క‌లో బ‌లంగా జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీకి బీజేపీ అప్పుడే అభ్యర్థుల ఎంపిక వేటలో పడింది. మంచి అభ్యర్థులను ప్రజల ముందు ఉంచితే గెలుపు సులువు అవుతుందనేది బీజేపీ వ్యూహం. ఈ క్ర‌మంలోన రాష్ట్ర రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువు అయిన బ‌ళ్లారిలో ఈ సారి ఎవ‌రిని పోటీలో ఉంచాల‌నే అంశంపై కేంద్ర నాయ‌క‌త్వం ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ళ్లారి సిటీ నుంచి వైద్య వృత్తిలో పేరుండ‌డంతో పాటు బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గానికి చెందిన బీకేఎస్ ఫ్యామిలీ నుంచి ఎవ‌రిని అయినా బ‌రిలో దించాల‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. బీకేఎస్‌ ఫ్యామిలీతో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు సన్నిహిత సంబంధాలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. గాలి సోద‌రులు అక్ర‌మ కేసుల్లో ఇరుక్కోవ‌డంతో వారు త‌మ‌కి టిక్కెట్టు ఇవ్వ‌క‌పోయినా త‌మ స‌న్నిహితుల్లో ఎవ‌రికో ఒక‌రికి టిక్కెట్టు ఇప్పించుకోవాల‌ని మ‌రోవైపు అప్పుడే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశారు.

ఇక బీకేఎస్ మూర్తి ఏపీకి చెందిన వారు కావడం విశేషం. మూర్తి సొంతూరు ఆంధ్రలోని అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా భూపసముద్రం. ఇక సుష్మా స్వ‌రాజ్ బీకేఎస్ ఫ్యామిలీతో పాటు ఒక‌రిద్ద‌రు త‌ట‌స్తుల పేర్ల‌ను అమిత్ షాకు వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీ బ‌ళ్లారిలో గాలి ఫ్యామిలీ పెత్త‌నానికి చెక్ పెట్టేందుకు పావులు క‌దుపుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.