వైసీపీ నిన్న హ్యాపీ… నేడు డీలా

క‌ర్నూలు జిల్లా వైసీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. నిన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీలో చేర‌డంతో ఫుల్ ఖుషీగా ఉన్న జ‌గ‌న్ పార్టీకి ఆ మ‌రుస‌టి రోజే ఎవ్వ‌రూ ఊహించ‌ని షాక్ త‌గిలింది. భూమా ఫ్యామిలీకి చెందిన మంత్రి అఖిల‌ప్రియ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ జిల్లా ఉపాధ్య‌క్షుడు బోరెడ్డి ల‌క్ష్మీరెడ్డి త‌న ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేశారు. 

పార్టీకి రాజీనామా చేసిన ల‌క్ష్మీరెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వైసీపీలో డ‌బ్బున్న వారికి, దౌర్జ‌న్యాలు చేసే వారికి, అవినీతిప‌రుల‌కు మాత్ర‌మే విలువ ఉంద‌ని, నిజాయితీతో ప‌నిచేసేవారికి ఇక్క‌డ గుర్తింపు లేద‌ని పార్టీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతున్న వారికి ఇక్క‌డ అడుగ‌డుగునా అవ‌మానాలే ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

తాను వైసీపీలో గుర్తింపు ఉంటుంద‌ని, బీజేపీకి రాజీనామా చేసి మ‌రీ పార్టీలో చేరాన‌ని ఆయ‌న చెప్పారు. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాన‌ని, అయినా ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు త‌న‌ను పిల‌వ‌డం లేద‌ని ఆయ‌న వాపోయారు. 

ల‌క్ష్మీరెడ్డి ద్వితీయ శ్రేణి నాయ‌కుడు అయినా వైసీపీ బ‌లంగా ఉన్న ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డం ఆలోచించ‌ద‌గ్గ‌దే. ఇక శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేరిన మ‌రుస‌టి రోజునే ఇలా జ‌ర‌గ‌డం కూడా వైసీపీకి షాక్ లాంటిదే.