జ‌గ‌న్‌ను టెన్ష‌న్ పెడుతున్న బొత్స‌

ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న హ‌వా కొన‌సాగాల్సిందే! ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ఆయ‌న మాట నెగ్గితీరా ల్సిందే! లేక‌పోతే ఇక అంతే సంగ‌తులు! రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. ఇప్పుడు విజ‌య న‌గ‌రం జిల్లా రాజకీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు! రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం వైసీపీలో చేరిన ఆయ‌న‌.. ఇప్పుడు రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ఇదే స‌మ‌యంలో పార్టీలోని త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ చెప్పేందుకు వ్యూహాత్మ కంగా పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే జిల్లాలో టీడీపీ బ‌లంగా దూసుకుపోతోంది. ఈ స‌మ‌యంలో పార్టీ నిర్మాణంపై దృష్టిసారించ‌కుండా.. పార్టీలోనే అంతర్గ‌త క‌ల‌హాలు సృష్టిస్తూ అధినేత జ‌గ‌న్‌కు టెన్ష‌న్ తెప్పిస్తున్నార‌ట‌!!

విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో బొత్స క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. ఇప్ప‌టికే గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్న ఆయ‌న‌.. తాజాగా మ‌రో చిచ్చు రేపారు! జిల్లా రాజకీయాల్లో కోలగట్ల వీరభద్రస్వామికి ప్రత్యేక స్థానముంది. ఇప్పటికీ విజయనగరం నియోజకవర్గంలో ప్రత్యర్థులకు గట్టిసవాల్‌ విసిరే స్థాయిలోనే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై పలుమార్లు పోటీపడ్డారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు వీరభద్రస్వామి. దీనికి అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న బొత్స సత్యనారాయణతో ఉన్న విభేదాలే కారణమని కోలగట్ల భావించారు. ఇర 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు!

విజయనగరం నుంచి పోటీపడ్డారు . కాని మరోసారి ఓటమే ఎదురైంది. పార్టీలో కీలక నేతగా ఉన్న కోలగట్లకు వైసీపీ అధినేత జిల్లాపార్టీ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరడంతో జిల్లాలో మరోసారి.. కోలగట్ల వర్సెస్‌ బొత్స ఆదిపత్యపోరు మొదలైంది. వీటికి తోడు బొత్స వర్గాన్ని ఎదుర్కోవడంలో అప్పటిదాగా తోడుగా ఉన్న సుజయకృష్ణరంగారావు టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో బొత్స వర్గాన్ని ఎదుర్కోవడంలో కోలగట్ల వీరభద్ర స్వామి మరోసారి ఒన్‌మ్యాన్‌ ఆర్మీగా మారారు. బొత్స సత్యనారాయణ పార్టీలో చేరిన తర్వాత కొంతకాలం కోలగట్ల కూడా సైలెంట్‌గానే ఉన్నారు.

రెండు వర్గాలు వేరువేరుగానే పార్టీకార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అంతా సామర్యసంగానే సాగుతోంది. కాని.. ఇటీవల జిల్లాపార్టీ అధ్యక్షునిగా బొత్స అనుచరుడైన బెల్లాన చంద్రశేఖర్‌కు అవకాశం దక్కింది. దీంతో కోలగట్ల వీరభద్ర స్వామి అలిగారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే పార్టీకి మాత్రం తన సేవలు అందిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో తాను మరోసారి అసెంబ్లీకి పోటీపడనని వీరభద్రస్వామి ప్రకటించారు. దీంతో.. జిల్లా వైసీపీలో కలకలం మొదలైంది. అయితే 2019 ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వీరభద్రస్వామేనని వైసీపీ నేతలు అంటున్నారు.