టీడీపీలో ఈ కులాల‌కు మొండిచెయ్యేనా..!

అన్ని వ‌ర్గాల వారికీ స‌మ ప్రాధాన్యం ఉంటుంద‌ని, ఏ వ‌ర్గానికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే స్పష్టం చేస్తుంటారు. కానీ ఇది మాట‌ల‌కే పరిమిత‌మైంద‌నే వార్త‌లు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వంలో బీసీ, దళితులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని వ‌ర్గాల‌నే ఆయ‌న అక్కున చేర్చుకుంటున్నార‌ని ఆయా వ‌ర్గాల నేత‌లు వాపోతున్నారు. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ వర్గాల వారికి అన్యాయం జ‌రిగింద‌ని కుమిలిపోతున్నారు. ఇక పార్టీలో ఆయా వ‌ర్గాల‌కు మొండి చేయి త‌ప్ప‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. ఇదే జ‌రిగితే భవిష్య‌త్తులో పార్టీకి న‌ష్టం తప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నార‌ట‌.

ఎన్టీఆర్ హ‌యాంలో ఈవర్గాలకు సముచిత స్థానం కల్పించి గౌరవించారని, చంద్రబాబు హ‌యాంలో బీసీ ల‌కు ప్రాధాన్యత ఇచ్చినా తర్వాత వారిని దూరంగా ఉంచటం గమనార్హం అంటున్నారు. రాష్ట్రంలో బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన గౌతు లచ్చన్న కుమారుడు శ్యామ్‌సుందర శివాజీని కనీసం మంత్రివర్గ విస్తరణలో పరిగణలోనికి తీసుకోలేదు. ఇదే వర్గానికి చెందిన సీనియర్‌ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు విజ్ఞ‌ప్తిని కూడా ప‌ట్టించుకోలే దంటున్నారు. గౌడ సామాజికి వర్గానికి చెందిన యువ శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌కు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశించినా దక్కకపోవ‌డంతో గౌడవర్గం నివ్వెర పోయింది.

తాజా మంత్రివర్గ విస్తరణలో ఉత్త‌రాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉంటే ప్రస్తుతం ముగ్గురయ్యారు. శ్రీకాకుళం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు(బీసీ వెల‌మ‌), విజయనగరం నుంచి సుజయ కృష్ణరంగారావు(ఓసీ), విశాఖ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు(బీసీ వెల‌మ‌)లకు చోటు లభించింది. ఉత్తరకోస్తాలో ఐదుగురు మంత్రులకు గాను రెండు కాపులకు దక్కాయి. ఇక్కడ బలమైన వర్గాలుగా కాపులు, వెలమలు ఉన్నప్పటికీ కాళింగులు, గవరలు, శెట్టిబలిజ, గిరిజనలు సామాజిక వర్గాలు బలంగా ఉండటంతో పాటు, గతంలో మంత్రులుగా కూడా పనిచేసిన నేపథ్యం కలిగి ఉన్నారు. ఈవర్గాలను పట్టించుకోకపోవటంతో ప్రస్తుతం పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు.

తాజా మంత్రివర్గ విస్తరణలో బీసీ కులాలన్నీ తమకు అన్యాయం జరిగిన తీరుపట్ల మండిపడుతున్నాయి. ఇతర కులాలను నామమాత్రంగా కూడా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పార్టీలు మార్చి చంద్రబాబును దుమ్మెత్తిపోసిన కిమిడి కళావెంకట్రావ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో వారంతా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తూర్పుకాపులు, గిరిజనలు,కొప్పుల వెలమలు అధికంగా ఉన్న జిల్లాలో ఓసీని మంత్రి చెయ్యటం పట్ల బీసీ దళిత వర్గాలు రగిలిపోతున్నాయి. బీసీలు,దళితులకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వకుండా ఓసీలతో రాజకీయం నెరపుతున్నారని, ఇలా అయితే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.