బాబు భ‌య‌ప‌డుతున్నారా..? బాబుకు ఎందుకు భ‌యం..?

అవును! బాబు భ‌య‌ప‌డుతున్నారా?  ఆయ‌న‌కు ఎందుకు భ‌యం? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ఏపీ ప్ర‌జ‌ల‌నే కాదు, ఉన్న‌త‌స్థాయి అధికారుల‌ను సైతం వేధిస్తున్నాయి. ఏ చిన్న తేడా వ‌చ్చినా సొంత అన్న‌ద‌మ్ములే.. త‌గువులు పెట్టుకుని న్యాయ పోరాటానికి దిగుతున్న రోజులు ఇవి! మ‌రి అలాంటిది విశాల జ‌న హితం ముడిప‌డిన ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీళ్లు వంటి వాటి విష‌యంలో బాబు ఎందుకు ఉదాసీన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షం అంటే గౌర‌విస్తాం. కేంద్రంతో తెగ‌తెంపులు అందుకే చేసుకోవ‌డం లేదు అనే కోణంలో బాబు స‌ర్ది చెప్పారు. 

కానీ, ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప పోరు, కాకినాడ ఎన్నిక‌ల్లో బాబుకు జ‌నం పూర్తిగా మ‌ద్ద‌తు ప‌లికారు. అంతేకాదు, బాబుకు మేమున్నామ‌న్న భ‌రోసా ఇచ్చారు. అలాంట‌ప్పుడు ఇంకా ఆయ‌న మిత్ర ధ‌ర్మం అంటూ ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తారా?  లేక బాబు ఇలా కేంద్రం నుంచి ఏమీ తీసుకురాకుండా. కాల క్షేపం చేస్తూ.. క‌బుర్లు చెప్ప‌డం వెనుక ఇంకేమైనా రీజ‌న్ ఉందా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న ప్ర‌జ‌ల‌ను వేధిస్తోంది. కేంద్రాన్ని చూసి బాబు భ‌య‌ప‌డుతున్నారా? అనే కోణంలోనే ప‌రిస్థితి ఉంద‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు కూడా. 

నిజానికి  రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్రాకు ఇస్తామ‌న్న నిధులూ ప్ర‌యోజ‌నాలు ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన‌వి చాలానే ఉన్నాయి.  రైల్వే జోన్.. వ‌చ్చేస్తోంది వ‌చ్చేస్తోంద‌ని అన్నారే త‌ప్ప‌, అది జీవిత కాలం ఆల‌స్యంలా క‌నిపిస్తోంది. రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటు భ‌ర్తీ చేసే బాధ్య‌త కూడా త‌మ‌దే అని కేంద్రం చెప్పింది. ఇంకా చేయాల్సిన భ‌ర్తీ చాలానే ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అంటోంది. ఇలా చెబుతూనే మూడున్న‌రేళ్లు గ‌డిపేశారు. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నికలు అంటున్నారు. ఈ లోగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన‌వ‌న్నీ కేంద్రం ఇస్తుందా అనేది అనుమానంగానే మారుతోంది. 

నిన్న‌టికి నిన్న  సీఎం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీతో స‌మావేశ‌మ‌య్యారు. ఆ త‌రువాత‌, మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాకు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తున్న‌ట్టుగా గ‌త ఏడాది కేంద్రం ప్ర‌క‌టించినా, ఇప్ప‌టివ‌ర‌కూ చాలా త‌క్కువ నిధులు వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్యాకేజీ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం చాలా నిధులు రావాల్సి ఉన్నా, విడుద‌ల విష‌యంలో కేంద్రం తాత్సారం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇచ్చిన ప్యాకేజీ ప్ర‌కారం నిధుల‌ను త్వ‌రిత‌గ‌తిన విడుద‌ల చేయాల‌ని ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీని కోరిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. 

ఈ సంద‌ర్భంగా రావాల్సిన నిధులు, కేంద్రం ఇస్తామ‌న్న నిధులకు సంబంధించిన కొన్ని గ‌ణాంకాల‌ను సీఎం వివ‌రించారు. కానీ, ఈ గ‌ణాంకాల విష‌యంలోనూ కేంద్రానికి బాబు చెబుతున్న దానికీ చాలా తేడా క‌నిపిస్తోంది. నిజానికి ఆయ‌న 16 వేల కోట్ల లోటు బ‌డ్జెట్ అంటున్నారు. కేంద్రం మాత్రం ఇది 4 వేల కోట్లే అంటోంది. అంతేకాదు, ఇప్ప‌టికే చాలా ఇచ్చామ‌ని ఇక 138 కోట్లే ఇవ్వాల్సి ఉంద‌ని కేంద్రం చెబుతోంది. మ‌రి ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ఎందుకు గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌పోతున్నారు? అంటే మిలియ‌న్ డాలర్ల ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి ఏపీని ఆదుకునే నాథుడు ఎవ‌రో?!