వాటి గురించి ఇప్పుడే తెలిసిందా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త నాలుగు రోజులుగా చేస్తున్న హ‌డావుడి ఆర్భాటం అంతా ఇంతాకాదు. జ‌ల‌సిరికి హార‌తి పేరుతో ఆయ‌న చేస్తున్న కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జాధ‌నం నీళ్ల‌లా ఖ‌ర్చ‌యిపోతోంది. నీటి సంర‌క్ష‌ణ, నీటి వినియోగం కాన్సెప్టుకి మ‌రీ ఇంత భారీ రేంజ్‌లో బాబుగారు బిల్డ‌ప్ ఇవ్వ‌డంపై గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు అంద‌రూ నవ్వుకుంటున్నారు. నీటి ప్రాధాన్యం చెప్పాలంటే ఇలా కోట్ల‌రూపాయ‌ల ప్ర‌జాధ‌నంతో ప‌త్రిక‌ల‌కు, టీవీల‌కు యాడ్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందా అని ప్ర‌శ్నిస్తున్నారు. దేశంలో అది కూడా రాష్ట్రంలో నీటి విలువ ఎవ‌రికీ తెలియ‌ద‌న్న‌ట్టుగా, తాను మాత్ర‌మే జ‌ల‌ము-జాగ్ర‌త్త‌లు క‌నిపెట్టాన‌న్న‌ట్టుగా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

నిజానికి బాబుకు త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం క‌న్నా.. రాష్ట్ర శ్రేయ‌స్సు ప్ర‌ధానం అనుకుంటే ఈ కార్య‌క్ర‌మాల తీరు వేరేగా ఉండేద‌ని అంటున్నారు ప్ర‌భుత్వంలోని కొంద‌రు సీనియ‌ర్ అధికారులు. ఇంత హ‌డావుడి ఆర్భాటం అక్క‌ర‌లేద‌ని, ప్ర‌కృతి సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ప‌ర్యాట‌క శాఖ‌ను వినియోగించుకుని, ఆ శాఖ‌కు కేటాయిస్తున్న నిధుల‌ను వినియోగిస్తే చాల‌ని చెబుతున్నారు. ఒక ప‌క్క జ‌లం పేరుతో పూజ‌లు చేస్తూ.. మ‌రో ప‌క్క అదే జ‌లానికి సంబంధించిన ప్రాజెక్టుల్లో అవినీతి ఏరులై పారుతున్నా.. ప‌ట్టించుకోక‌పోవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఒక్క‌ పట్టిసీమ ప్రాజెక్టునే తీసుకుంటే.. బాబు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్టులో దాదాపు 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కాగ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అయినా తేలుకుట్టిన దొంగ‌లా నొరు మెద‌ప‌ని చంద్ర‌బాబు .. జ‌లం పేరుతో ప్ర‌జాధ‌నాన్ని ధార‌లా ఖ‌ర్చు చేసేస్తున్నార‌ని అంటున్నారు. సాధార‌ణంగా కిందిస్థాయి నేత‌ల‌కు ఈ క్ర‌తువును అప్ప‌గించి తాను హుందాగా రాష్ట్ర రాజ‌ధానిలో కూర్చుకుని మిగిలిన ప‌నులు చూడొచ్చ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం చేప‌ట్టిన జ‌ల‌సిరికి హార‌తి-వెనుక నిధుల కైంక‌ర్యం త‌ప్ప మ‌రో క్ర‌తువుకు తావులేద‌ని అంటున్నారు. పూజ‌లు చేసినా, పూజ‌లు చేయ‌క‌పోయినా.. వ‌చ్చే నీరు వ‌స్తుంద‌ని, ప్ర‌వ‌హించే నీటికి ఎవ‌రూ అడ్డుప‌డ‌లేర‌ని అంటున్నారు. మ‌రి బాబు ఇప్ప‌టికైనా త‌న ప‌ద్ధ‌తిని మార్చుకుని హంగామా త‌గ్గించి.. ప్ర‌జ‌ల‌కు ఉప యోగ‌ప‌డే ప‌నులు చేస్తారేమో చూద్దాం.