విశాఖ కుంభ‌కోణాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించేశారా?

విశాఖ భూ క‌బ్జా వ్య‌వ‌హారం అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ జిల్లాకు చెందిన‌ మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న పాత్రుడి మ‌ధ్య వివాదంగా మారింది. ఒక‌రిపై ఒక‌రు బాహాటంగానే విమ‌ర్శ‌లు చేసుకునే స్థాయికి చేరింది. ఈ పంచాయితీ సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. భూకుంభ‌కోణం గురించి ప్ర‌జ‌లు ఆలోచించ‌కుండా.. దానిని నీరుగారే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్న స‌మ‌యంలో.. అయ్య‌న్న‌పై మంత్రి గంటా లేఖ దీనికి బ‌లం చేకూరుస్తోంది. కావాల‌నే దీనిని మంత్రుల మ‌ధ్య వివాదంగా మార్చార‌నే సందేహాలు వినిపిస్తున్నాయి. సీఎం క‌నుస‌న్న‌ల్లో ఇదంతా జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జా వ్యవహారంలో సీఎంచంద్ర‌బాబు స‌రికొత్త నాట‌కానికి తెర‌తీశార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. కుంభకోణాన్ని క్రమేణా పక్కదారి పట్టించే వ్యూహంలో భాగంగానే మంత్రి అయ్య‌న్న‌పాత్రుడిపై మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు లేఖ రాశార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. విశాఖలో వందల ఎకరాల భూములు కబ్జా అవ్వడం, స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబుతో పాటు సీఎం చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్‌ సారథ్యంలోనే జరిగినట్లు విపక్షాలు, మేధావులు దుయ్యబడుతున్న విష‌యం తెలిసిందే!

భీమునిపట్నంతో సహా విశాఖలోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూముల కబ్జాలు జరుగుతున్నాయని అయ్య‌న్న‌పాత్రుడు వ్యాఖ్యానించ‌డం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై క‌లెక్ట‌ర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇంతలా తనపై రచ్చ జరుగుతున్నా నోరు విప్పని మంత్రి గంటా.. అకస్మాత్తుగా బుధవారం సీఎంకు లేఖ రాయడం రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గంటా ఇలా లేఖరాయడం సీఎం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.

భూముల కబ్జా వ్యవహారాన్ని పక్కదారి పట్టించి.. జనంలో భూములపై చర్చ కాకుండా మంత్రుల విభేదాలపైనే చర్చ జరిగేలా చేసి ప్రజల దృష్టిని మళ్లించాల‌న్న‌ది సీఎం అభిమ‌తమ‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. విశాఖ భూ కుంభకోణాలపై బహిరంగ విచారణ చేస్తామని మంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా ప్రకటించడంతో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించిన ఆయ‌న గ్ర‌హించార‌ని, బహిరంగ విచారణ సాగితే ఈ వ్యవహారం మొత్తం బట్టబయలవుతుందని భావించి, స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)తో విచారణ అంటూ కొత్త డ్రామాకు తెరలేపార‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.