చంద్ర‌బాబు డెసిష‌న్‌… ప‌య్యావుల ఇగో హ‌ర్ట్‌

టీడీపీ సీనియ‌ర్‌నేత‌, అనంత‌పురం ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌కు సొంత పార్టీలో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. అనంత పురం జెడ్పీ చైర్మ‌న్ విష‌యంలో ప‌య్యావుల పావులు క‌దిపి.. దానిని త‌న అనుచ‌రుడి చేతిలోనే ప‌దిలంగా ఉంచాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఒక్క‌టీ సాగ‌క‌పోగా.. ఎదురు దెబ్బే త‌గిలింది. ప్ర‌స్తుతం జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి ఖాళీగా ఉంది. దీనిని ఇన్‌చార్జి చైర్మ‌న్ నిర్వ‌హిస్తున్నాడు. ఈ ఇన్‌చార్జ్ ప‌య్యావుల ప్రధాన అనుచ‌రులు. ఈ క్ర‌మంలోనే దీనికి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు నిర్వ‌హించి చైర్మ‌న్‌ను ఎంపిక చేయాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆదేశించారు. ఈ ఎన్నిక బాధ్య‌త‌ను టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే బీకే పార్థ‌సార‌ధికి అప్ప‌గించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. అనంత జెడ్పీ చైర్మ‌న్‌గా పూల నాగ‌రాజు పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. అయితే, ఈయ‌న‌కు చైర్మ‌న్‌గిరీ ఇవ్వ‌డం ప‌య్యావుల‌కు స‌సేమిరా ఇష్టం లేదు. దీంతో ఎన్నిక జ‌ర‌గ‌క‌పోతే.. ఈయ‌న ఎలాగూ గెల‌వ‌డు కాబ‌ట్టి జెడ్పీ చైర్మ‌న్ ఎన్నిక‌ను వాయిదా వేస్తూ వ‌చ్చాడు. వాస్త‌వానికి జిల్లా ప‌రిష‌త్‌లో ప‌య్యావుల‌కి 43 మంది జెడ్‌పీటీసీలు ఉన్నారు. వీరితో పాటు మ‌రొక ఇండిపెండెంట్ కూడా అధికార పార్టీకి మ‌ద్ద‌తిస్తున్నాడు. దీంతో వీరి బ‌లం 44కు చేరింది.

గత ఒప్పందం ప్రకారం పూల నాగరాజుకు ఛైర్మన్‌ పదవి అప్పచెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ ప‌ద‌విని పూల‌కు అప్ప‌గించ‌డం ఇష్టంలేని ప‌య్యావుల ఎన్నిక జరగకుండా జాప్యం చేయించాలని భావించారు. కానీ బాబు మాట‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా ఫాలో అయ్యే.. పార్థ‌సార‌ధి మాత్రం చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

సమావేశానికి జెడ్పీటీసీలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో పాటు అందరూ హాజరు కావాలని కోరారు. ఈ క్ర‌మంలో దీనిపై చర్చించి ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా నియమించాలని ఏదైనా అభ్యంతరాలు ఉంటే అధినేతకు చెప్పుకోవాల‌ని తీర్మానించారు. దీంతో ఇప్పుడు ప‌య్యావుల ఇగో హ‌ర్ట‌య్యింది. సీనియ‌ర్ నేత‌నైన త‌న తోకే క‌ట్ చేయ‌డంపై ఆయ‌న లోలోనే ఫైరైపోతున్నార‌ట‌.